Begin typing your search above and press return to search.

పాపం సోనియాగాంధీ : కాంగ్రెస్ చరిత్రలోనే ఊహించని సన్నివేశం

By:  Tupaki Desk   |   21 July 2022 1:25 PM GMT
పాపం సోనియాగాంధీ : కాంగ్రెస్ చరిత్రలోనే ఊహించని సన్నివేశం
X
రోజు బాగుంటే ఎవరైనా రాజే. అది కాస్తా తారు మారు అయితేనే కాని రోజులు అవుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దానికి కారకులు మోడీ కేంద్రం, అమిత్ షా అని ఖద్దరు పార్టీ నేతలు అంటున్నా కూడా కర్మ సిద్ధాంతం కూడా నమ్మితే కచ్చితంగా అదే అనుకోవాలి.

ఒకనాడు కాంగ్రెస్ ఏలుబడిలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ని ముందు పెట్టి యూపీయే చైర్ పర్సన్ హోదాలో దేశం మొత్తం అధికార చక్రం తిప్పిన ఘనత సోనియాగాంధీది. నాడు కాంగ్రెస్ ని ఎదిరించిన వారికి ఈడీ, సీబీఐ ఎదురెళ్ళి మరీ సంకెళ్ళు వేసేవి. అలా జైలు పాలు అయిన నేతలు ఎందరో ఉన్నారు. దర్యాప్తు సంస్థలను తమ కోసం సొంత రాజకీయం కోసం వాడుకుంటున్నారు అన్న నిందలు వచ్చినా కాంగ్రెస్ తలెగరేసి పట్టించుకోని రోజులు అవి.

ఆ విధంగా చూస్తే ఈ రోజు దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా మీద సీబీఐ కేసులు పెట్టింది. జైలు పాలు చేసింది. ఇక ఏకంగా గుజరాత్ రాష్ట్ర బహిష్కరణనే చేసింది. ఏపీకి వస్తే ప్రస్తుత సీఎం జగన్ మీద సీబీఐ ఈడీ కేసులు పెట్టారు. దాంతో ఆయన పదహారు నెలలు జైలులో ఉన్నారు.

కాంగ్రెస్ ని ధిక్కరించిన వారినీ, తమ రాజకీయ ప్రత్యర్ధులను ఏమీ కాకుండా చేసేందుకు తన చేతిలో ఉన్న అపరిమిత అధికారాలను కాంగ్రెస్ నాడు వాడుకుంది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. అంతటి సోనియా గాంధీ ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆమెని ఈడీ మూడు గంటల పాటు విచారించింది.

మరోసారి రావాలని కూడా కోరింది. ఈ విచారణ ఎన్నాళ్ళు సాగుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఒక్క విషయం సోనియా గాంధీ మీద నేరం నిరూపణ అవుతుందా ఆమెకు శిక్ష పడుతుందా అన్నది పక్కన పెడితే ఈడీ ముందు విచారణకు సోనియా గాంధీ హాజరు కావడమే అతి పెద్ద శిక్ష అనే వారూ ఉన్నారు.

ఒకనాటి వెలుగులు అన్నీ కరిగిపోగా, దేశంలో కాంగ్రెస్ కాంతులు మసకబారిపోగా మళ్ళీ ప్రకాశించే అవకాశాలు సన్నగిల్లిన వేళ ఏడున్నర పదుల ముదిమి వయసులో ఒక వైపు అనారోగ్యంతో సోనియా గాంధీ ఈడీ గడప తొక్కారు అంటే నిజంగా పాపం సోనియా అనే అంటున్నారు అంతా.

ఏది ఏమైనా విధి రాతను నమ్మేవారు మాత్రం ఇలాగే జరుగుతుందని కూడా అంటారు. కేంద్రం బలవంతంగా కేసులు బనాయించింది అని కాంగ్రెస్ వారు నిప్పులు చెరిగినా కూడా జరిగినది చూస్తే సోనియా గాంధీ విచారణ దాకా రావడమే అసలైన మనో వ్యధ అని అంటున్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని సోనియా గాంధీ మాత్రమే కాదు కాంగ్రెస్ వారు కూడా కలలో సైతం ఊహించి ఉండరేమో.