Begin typing your search above and press return to search.

లాలూ వద్దు.. ఆయన కులప్రచారం ముద్దు!

By:  Tupaki Desk   |   12 Sep 2015 4:28 AM GMT
లాలూ వద్దు.. ఆయన కులప్రచారం ముద్దు!
X
ఇది కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వింత పోకడ! లాలూ అవినీతి పరుడు అని ముద్రపడిన నాయకుడు గనుక.. ఆయనతో కలిసి వేదిక పంచుకుని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత రథసారధులు సోనియా, రాహుల్‌ లకు ఇష్టం లేదుట. లాలూ యాదవ్‌ వంటి అవినీతి పరుడు ఉన్న వేదికమీద తాము పక్కన కూర్చుని ఎలా మాట్లాడగలం? అని వారు ఈసడించుకుంటున్నారు గానీ.. లాలూ వలన లభించగల కులం ఓట్లను మాత్రం దండిగానే కోరుకుంటున్నారు. మహాకూటమి తమకు కేటాయించిన 40 సీట్లలో యాదవుల ఓట్లు పొందడానికి ఆయన కూడా వచ్చి ప్రచారం చేయాలని మాత్రం రిక్వెస్టు చేస్తున్నాయి.

లాలూ ఏమీ తక్కువ తినలేదు. తాను వద్దు.. తన ప్రచారం ముద్దు అన్నట్లుగా అవకాశవాద వైఖరిని ప్రదర్శిస్తున్న కాంగ్రెసుకు రకరకాల కండిషన్ లు పెడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీచేస్తున్న ప్రాంతాల్లో యాదవుల ఓట్లు వారికి అనుకూలంగా పడేలాగా.. తాను వెళ్లి ప్రచారం చేయాలంటే గనుక.. ముందుగా సోనియా రాహుల్‌ లు బీహార్‌ లో పాల్గొనే ఎన్నికల ప్రచార సభల్లో.. తాను కూడా వారి పక్కనే కూర్చుని పాల్గొనాల్సి ఉంటుందని.. అందుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌ కు అనుకూలంగా ప్రచారం చేయగలనని కండిషన్ లు పెడుతున్నారట. మరి.. ఒకసారి లాలూను అవినీతి వ్యతిరేక సిద్ధాంతాల మీద వెలివేసిన తర్వాత.. మళ్లీ ఆయనతో వేదిక పంచుకోవడానికి సోనియా, రాహుల్‌ లు ఒప్పుకుంటారో లేదో.

అయితే ఇలా మహాకూటమికి చెందిన ఈ పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంలో ఇలా కండిషనల్‌ గా పోట్లాడుకుంటూ ఉంటే.. అది ప్రత్యర్థి భాజపాకు అనుకూలంగా మారుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అసలే బీహార్‌ ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని.. భాజాపా గెలిచే అవకాశం కూడ ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. మహాకూటమిగా ఏర్పడిన విపక్షాలు.. అన్ని పార్టీలకు కేటాయించిన అన్ని సీట్లలో గెలిచేలా అన్ని పార్టీల పెద్దలూ కలసి పనిచేయాలి గానీ.. ఇలాంటి శషబిషలకు పోతే.. మొదటికే మోసం వస్తుందని పలువురు అనుకుంటున్నారు.