Begin typing your search above and press return to search.

అమ్మ 'బాబో'య్.. పేరు పలకని సోనియా

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:33 AM GMT
అమ్మ బాబోయ్.. పేరు పలకని సోనియా
X
కాంగ్రెస్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దేశమంతా చెప్పులు అరిగేలా తిరిగి బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నారు. తాము చేయాల్సిన పనిని బాబు చేస్తుండడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. బాబునే దేవుడిలా చూస్తున్నాడు. 2019 ఎన్నికల్లో దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బాబు తమను అధికారంలోకి తీసుకొస్తాడని కలలు గంటున్నారు.

అయితే రాహుల్ గాంధీ ఎన్ని ఆశలు పెంచుకున్నప్పటికీ బద్ద విరోధిగా ఇన్నాళ్లు ఉన్న చంద్రబాబును సోనియాగాంధీ విశ్వసించడం లేదని నిన్నటి మేడ్చల్ సభతో తేటతెల్లమైంది. మేడ్చల్ లో సోనియా గాంధీ సభ తర్వాత టీడీపీ నేతలు షాక్ కు గురైనట్టు తెలిసింది.

చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మేడ్చల్ సభలో మాట్టాడిన రాహుల్ గాంధీ - సోనియా గాంధీ నోట ఒక్కసారి కూడా చంద్రబాబు మాట రాకపోవడం విశేషం. కనీసం టీడీపీ పేరును కూడా ప్రస్తావించడానికి వారికి ధైర్యం చాల్లేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఎంత సేపు కేసీఆర్ ను తిట్టారు తప్పితే బాబును వెనకేసుకొని రాలేదు.

ఓవైపు కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ ను వదిలి చంద్రబాబును టార్గెట్ చేశారు. బాబు కు అధికారం వస్తే తెలంగాణ ఫినేష్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానం పక్క రాష్ట్రం సీఎం కాళ్ల దగ్గర తాకట్టు పెడుతారా అని జనాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పెద్దలకు కూడా ధైర్యం చాలడం లేదు. బాబును ప్రస్తావిస్తే ఉన్న ఓట్లు కూడా రావని సోనియా - రాహుల్ అనుకున్నట్టున్నారు. అందుకే కనీసం ప్రస్తావించలేకపోయారు.

ఓవైపు చంద్రబాబుకు రాహుల్ - సోనియా అమిత ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసుకుంటోంది. కానీ నిన్నటి మేడ్చల్ సభలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించడానికి సోనియా ఇష్టపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి చంద్రబాబుపై కేసీఆర్ చేస్తున్న ప్రచారం ఎఫెక్ట్ కాంగ్రెస్ పెద్దలపై భారీగానే పడిందని.. బాబును గుర్తు చేసుకుంటే తమకే నష్టమని భావిస్తున్నట్టు అర్థమవుతోంది.