Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ చేసిన తప్పే అమ్మాకొడుకులు చేస్తారా?

By:  Tupaki Desk   |   19 Dec 2015 7:08 AM GMT
కేజ్రీవాల్ చేసిన తప్పే అమ్మాకొడుకులు చేస్తారా?
X
నేషనల్ హెరాల్డ్ కేసులో వేలాది కోట్ల రూపాయిలకు సంబంధించిన ఆరోపణలతో పాటు.. మోసం.. నమ్మకద్రోహం లాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న అమ్మాకొడుకులు సోనియాగాంధీ..రాహుల్ గాంధీలు ఇద్దరూ ఈ రోజుపాటియాలా కోర్టుకు హాజరు కానున్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్ పిటీషన్ దరఖాస్తు చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తొలుత బెయిల్ పిటీషన్ దాఖలు చేయరంటూ వార్తలు వెలువడినప్పటికీ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు.. న్యాయకోవిదుల సలహాతో అమ్మాకొడుకులు బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం పక్కా అన్న మాట వినిపిస్తోంది.ఈ సంద్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో చేసిన తప్పును అమ్మాకొడుకులు చేస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.

ఇంతకీ కేజ్రీవాల్ గతంలో చేసిన తప్పేంటన్న విషయంలోకి వెళితే.. తాజాగా కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న నితిన్ గడ్కరీపై కేజ్రీవాల్ గతంలో అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో..ఒళ్లు మండిన గడ్కరీ కోర్టులో కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే.. కోర్టుకు హాజరయ్యే సమయంలో బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేయకుండా మొండిగా వ్యవహరించారు. అయితే.. కోర్టులో కేజ్రీవాల్ అనుకున్న దానికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకోవటంతో ఒక్కసారి కళ్లు తెరుచుకున్న కేజ్రీ.. వెంటనే బెయిల్ పిటీషన్ ను స్వయంగా దరఖాస్తు చేసుకోవటమే కాదు.. గడ్కరీని స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని ఇచ్చి.. ఈ కేసు నుంచి బయటపడ్డారు.

ఇక.. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో అమ్మాకొడుకుల మీద నమోదు చేసిన సెక్షన్లు చూస్తే.. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులే. ఒకవేళ బెయిల్ దరఖాస్తు పెట్టుకోనిపక్షంలో కోర్టు వారిని రిమాండ్ కు పంపే ప్రమాదం ఉంది. ఇది పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని.. అందుకే బెయిల్ కు అవసరమైన బాండ్లు సిద్ధం చేసుకోవాలన్న పార్టీ నేతల సూచనను అమ్మాకొడుకులు పాటించే అవకాశాలే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.