Begin typing your search above and press return to search.

సోనియా గెలుపు మీదా సందేహాలా!

By:  Tupaki Desk   |   29 April 2019 4:30 PM GMT
సోనియా గెలుపు మీదా సందేహాలా!
X
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు - యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాయ్‌ బరేలీ పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ఆరంభం నుంచి కాంగ్రెస్‌ కు కంచుకోటగా భావించే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. జనతాదళ్‌ ఒకసారి - బీజేపీ రెండుసార్లు విజయం సాధించాయి. అయితే ప్రతి ఐదు పర్యాయాలకు ఒకసారి కాంగ్రెస్‌ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది.

అదే తరహాలో ఈసారి కూడా బోల్తా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా ఊపందుకోవడంతో కాంగ్రెస్‌ నేతల్లో అయోమయం నెలకొంది. గత 2014 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 80 సీట్లకు గానూ కాంగ్రెస్‌ గెలిచింది రెండు స్థానాలు మాత్రమే. రాయ్‌ బరేలి నుంచి సోనియాగాంధీ - అమేధీ నుంచి రాహుల్‌ గాంధీ మాత్రమే విజయం సాధించారు. అయితే ఈసారి రాహుల్‌ గెలుపు కష్టమని తెలియడంతో కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాయ్‌ బరేలి నుంచి సోనియాగాంధీ గెలుపు కూడా కష్టంగా ఉందని తెలుస్తోంది.

రాయ్‌ బరేలీ పార్లమెంటు స్థానం నుంచి నెహ్రూ కుటుంబసభ్యులు ఏడుసార్లు విజయం సాధించారు. 1957లొ ఫిరోజ్‌ గాంధీ గెలిచారు. అదేవిధంగా 1967 - 1971లో ఇందిరాగాంధీ రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా ఇందిరాగాంధీ 1978 ఉప ఎన్నికలో కర్ణాటకలోని చిక్కమగళూరు నుంచి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి సోనియాగాంధీ రాయ్‌ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 - 2006 - 2009 - 2014 ఎన్నికల్లో సోనియాగాంధీ రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా మరోసారి బరిలో ఉన్నారు. ఈమేరకు ఇప్పటి వరకు నెహ్రూ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ఏడుసార్లు గెలిచారు.

రాయ్‌ బరేలీ స్థానం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా 1952 - 1957 - 1962 - 1967 - 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. అయితే అప్పటి వరకు ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ 1977 ఎన్నికల్లో జనతాదళ్‌ అభ్యర్థి రాజ్‌ నారాయన్‌ చేతిలో ఓటమి చవిచూశారు. దేశ ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే ప్రథమం. అయితే అనంతరం 1980లో తిరిగి కాంగ్రెస్‌ విజయం సాధించింది. తర్వాత వరుసగా 1980 - 1984 - 1989 - 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. అయితే 1996 - 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అశోక్‌ సింగ్‌ గెలిచారు. తర్వాత 1999లో కాంగ్రెస్‌ నుంచి సతీశ్‌ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి 2009 - 2014 ఎన్నికల్లో సోనియాగాంధీ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే వయసు మీద పడటంతో ఈసారి ఓట్లు పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి తోడు యూపీలో బీజేపీ హవా కొనసాగుతుండటం.. రాహుల్‌ ప్రాబల్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో గెలవడం కష్టమని భావిస్తున్నారు.