Begin typing your search above and press return to search.

సోనియమ్మ నార్మల్ అయిపోయారట

By:  Tupaki Desk   |   14 Aug 2016 12:14 PM GMT
సోనియమ్మ నార్మల్ అయిపోయారట
X
ఒక ప్రముఖ వ్యక్తి.. ఒక ర్యాలీలో అదే పనిగా చేయి ఊపినందుకు చేతి ముంజేతి ఎముక ఫ్యాక్చర్ కావటం.. తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో ఉండిపోవటం లాంటివి వినటానికే విచిత్రంగా అనిపించే పరిస్థితి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని.. అనంతరం ఆమెకు ఎప్పటి నుంచో వైద్యం చేసే గంగారాం ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు చేర్పించిన సంగతి తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా.. తన ప్రచారాన్ని యూపీలోని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి ప్రచారాన్ని షురూ చేసిన కొద్ది గంటలకే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను.. యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీకి చేర్చటం తెలిసిందే. ఆమె అనారోగ్యానికి కచ్ఛితమైన కారణాన్ని అటు ప్రభుత్వ వర్గాలుకానీ.. అటు పార్టీ కార్యాలయం కానీ.. ఇటు వైద్యులు కానీ వెల్లడించకపోవటం తెలిసిందే.

ఒకసారి చేతి ముంజేతి ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని ఒకసారి.. తీవ్ర మైన జ్వరంతో బాధ పడుతున్నట్లుగా మరోసారి వార్తలు వచ్చాయే తప్పించి.. ఆమె ఎలాంటి అనారోగ్యంతో బాధ పడుతున్నారన్న విషయం పూర్తిగా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో చేరి పదకొండు రోజుల అనంతరం.. తాజాగా ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఫ్యాక్చర్ అయిన భుజానికి శస్త్రచికిత్స చేశారని.. వైరల్ ఫీవర్ నుంచి సోనియా కోలుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమె 10 జన్ పథ్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని.. ఎలాంటి సమస్యలు లేవని.. నార్మల్ గా ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ పదకొండు రోజులు ఆసుపత్రిలో ఉంచి చేసిన చికిత్స ఏమిటన్న వివరాలపై మాత్రం తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.