Begin typing your search above and press return to search.

అరే.. అమ్మ కూడా వెల్ లోకి దూసుకెళ్లిందే

By:  Tupaki Desk   |   12 Aug 2015 12:37 PM GMT
అరే.. అమ్మ కూడా వెల్ లోకి దూసుకెళ్లిందే
X
కాలమహిమ అంటే ఇలానే ఉంటుంది. పదేళ్ల పాటు నాన్ స్టాప్ అధికారంతో.. తన కంటిసైగతో దేశాన్ని నడిపించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఊహించని చర్యకు పాల్పడ్డారు. పార్లమెంటులో రాజకీయ పార్టీలు నిరసన నిర్వహించటం మామూలే అయినా.. అగ్రనేతలు ఆవేశపూరితంగా వ్యవహరించటం అరుదుగా ఉంటుంది.

మరీ.. అవసరమైతే.. తాము వెనుక ఉంటారే తప్ప.. తామే ముందుకెళ్లటం అనేది ఉండదు. గత కొద్దిరోజులుగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తదితరుల రాజీనామా అంశంపై నడుస్తున్న రచ్చ నేపథ్యంలో.. ఈ రోజు సుష్మాస్వరాజ్ తనపై వచ్చిన ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. లలిత్ మోడీ కుంభకోణంపై చర్చ నడుస్తున్న సందర్భంగా.. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా సమాధానం ఇస్తున్న సమయంలో.. ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరాజె పేరును ప్రస్తావించారు.

దీంతో అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో లేని వ్యక్తుల గురించి ఎలా ప్రస్తావిస్తారన్న కమలనాథుల మాటతో పాటు.. స్పీకర్ సుమిత్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో సభలో కొద్దిపాటి గందరగోళం చోటు చేసుకుంది. అదే సమయంలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన స్థానం నుంచి ఒక్కసారి.. సహచర సభ్యులతో పాటు కలిసి వెల్ లోకి దూసుకెళ్లటంతో మిగిలిన వారు నిశ్చేష్టులయ్యే పరిస్థితి.

పదేళ్లు పవర్ లో ఉన్నప్పుడు తన స్థానం నుంచి కదలకుండా కను సైగతో శాసించటమే కాదు.. రాష్ట్ర విభజన సమయంలో బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ఎంపీలపై ఉత్తరాది ఎంపీలు దాడి చేసిన సమయంలోనూ మారు మాట్లాడకుండా శిలా ప్రతిమలా కూర్చుండిపోయిన సోనియమ్మ ఈ రోజు మాత్రం ఆవేశంతో వెల్ లోకి దూసుకుపోవటాన్ని చూసిన పలువురు.. కాల మహిమ అనుకోవటం కనిపించింది.