Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అగ్ర నేత‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. మ‌ళ్లీ రెండోసారి పాజిటివ్!

By:  Tupaki Desk   |   13 Aug 2022 10:43 AM GMT
కాంగ్రెస్ అగ్ర నేత‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. మ‌ళ్లీ రెండోసారి పాజిటివ్!
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కరోనా వ‌ద‌లిపెట్ట‌డం లేదు. గ‌తంలో ఒక‌సారి క‌రోనా బారిన‌ప‌డ్డ సోనియాగాంధీ తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని పార్టీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆగ‌స్టు 13న ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇటీవలే కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే.

సోనియా గాంధీ కోవిడ్‌ బారిన పడడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం. జూన్‌లో ఆమెకు కోవిడ్ సోకింది. త‌ర్వాత కోవిడ్ అనంతర సమస్యలతో జూన్ 12న ఢిల్లీలోని సర్‌గంగా రామ్‌ ఆస్పత్రిలో చేరారు. జూన్‌ 20న కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మ‌ళ్లీ రెండు నెలలు తిరగకముందే మరోసారి కోవిడ్‌ బారిన పడ్డారు.

గత నెలలో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ విచారణకు కూడా సోనియా గాంధీ హాజరయ్యారు. అలాగే పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లోనూ పాల్గొన్నారు. అయితే, తాజాగా మరోసారి కరోనా బారినపడ్డారు.

కాగా దేశంలో రోజూ 20 వేల వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఢిల్లీలో క‌రోనా విజృంభిస్తోంది. రోజూ 2 వేల‌కు త‌గ్గ‌కుండా కేసులు న‌మోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే రెండు కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న‌వారికి బూస్ట‌ర్ డోసును కూడా వేస్తున్నారు. అయితే క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. మ‌రోవైపు ఢిల్లీ ప్ర‌భుత్వం క‌రోనా నియంత్ర‌ణ‌కు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సామాన్య ప్ర‌జ‌లే కాకుండా ప్ర‌ముఖులు కూడా కోవిడ్ బారిన ప‌డుతున్నారు. తాజా పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్టు వైద్యులు చెబుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఢిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు ఈ విష‌యాన్ని తెలిపారు.

కోవిడ్ సోకిన కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన సబ్ వేరియంట్ BA 2.75ను గుర్తించారు. ఈ వేరియంట్ ప్రభావం యాంటీబాడీలు ఉన్నవారిపైన, వ్యాక్సిన్ తీసుకున్నవారిపైనా కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.