Begin typing your search above and press return to search.

అవన్నీ.. దీదీ నుంచి సోనియమ్మ నేర్చుకున్నారా?

By:  Tupaki Desk   |   12 Aug 2015 5:19 AM GMT
అవన్నీ.. దీదీ నుంచి సోనియమ్మ నేర్చుకున్నారా?
X
దేశ రాజకీయాల్లో అగ్గి బరాటా బ్రాండ్ ఇమేజ్ ఉన్న మహిళా నేతలు కొందరున్నారు. వారి పేర్లు చెప్పటం మొదలుపెడితే.. మొదట వచ్చే పేరు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే. ఫైర్ బ్రాండ్ అన్న పదానికి నిలువెత్తు రూపంగా ఉండే ఆమె.. తన రాజకీయ ప్రత్యర్థులపై ఏ రేంజ్ లో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటంతో పాటు.. పదేళ్ల పాటు రిమోట్ కంట్రోల్ మాదిరి వ్యవహరిస్తూ.. దేశాన్ని తన కనుసన్నల్లో ఉంచుకున్నారన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న మరో మహిళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. మరి.. ఈ ఇద్దరి నేతల్లో ఎవరి స్థాయి ఏమిటన్న విషయానికి వెళితే.. సోనియమ్మ తర్వాతే మమతా బెనర్జీ అని ఎవరైనా చెబుతారు.

అలాంటి దీదీ నుంచి కూడా సోనియమ్మ నేర్చుకోవాల్సినవి ఉన్నాయా? అంటే.. ఉన్నట్లుగా ఆమే స్వయంగా చెప్పుకున్న ఆసక్తికర ఘటన తాజాగా చోటు చేసుకుంది. మంగళవారం పార్లమెంటులో కలిసిన ఈ మహిళ నేతల మధ్య కులాసా మాటలు కాసేపు సాగాయి. ఈ సందర్భంగా మోడీ సర్కారుపై.. రాజీ లేని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఏన్డీయే ప్రభుత్వంపై బాగా పోరాడుతున్నారంటూ మమత ఇచ్చిన కితాబుకు స్పందించిన సోనియా.. ‘‘అదంతా మీ నుంచి నేర్చుకున్నదే’’ అని వ్యాఖ్యానించటం విశేషం. ఫర్లేదు.. తనకు మించి ఎవరూ ఉండరన్నట్లుగా భావిస్తారని చెప్పే సోనియాగాంధీ.. మాటల్లో అయినా తాను నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని ఒప్పుకున్నారే..?