Begin typing your search above and press return to search.

రాహుల్ కోసం సోనియా మాస్ట‌ర్ ప్లాన్ ఫ‌లిస్తుందా?

By:  Tupaki Desk   |   13 Oct 2019 6:03 AM GMT
రాహుల్ కోసం సోనియా మాస్ట‌ర్ ప్లాన్ ఫ‌లిస్తుందా?
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా తిరిగి రాహుల్‌ గాంధీ ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్నారా? పార్టీ నేత‌లే ఈ డిమాండ్ చేసే విధంగా హ‌స్తం ముఖ్యులు ఎత్తులు వేస్తున్నారా? యూపీఏ చైర్‌ ప‌ర్స‌న్ సోనియాగాంధీ నేతృత్వంలో ఈ భారీ ఆప‌రేష‌న్ సాగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొంటూ ముఖ్య‌నేత‌లైన అశోక్ తన్వర్ - సంజయ్ నిరుపమ్ - ప్రద్యుత్ దెబర్‌ మాన్ తిరుగుబాటు చేయ‌డం పార్టీలో అసంతృప్తికి కార‌ణం కాద‌ని...రాహుల్‌కు తిరిగి కుర్చీ అప్ప‌గించ‌డమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న స‌మ‌యంలో రాహుల్ టీం.. పార్టీలో టార్గెట్ అవుతోంది. పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. రాజీనామాల బాట ప‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపాసన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ కాంబోడియా వెళ్లారన్న వార్త ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఇదంతా ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రుగుతుంద‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌.

రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సీనియర్ నేతలు (ముఖ్యంగా సోనియా గాంధీ కోటరీ) అసంతృప్తికి గురయ్యారు. ఆయన పనితీరుపై పలు సందర్భాల్లో అసమ్మతి తెలిపారు. అలాగే లోక్‌ సభ ఎన్నికల్లో రాహుల్ సూచనలకు మద్దతు కరువైంది. రాఫెల్ వివాదం విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల దాడి చేసినప్పుడు కొద్ది మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు రాహుల్‌ ను షాక్‌ కు గురిచేశాయి. సీనియర్ నేతలు ఎప్పటికీ తనకు అండగా నిలువరని భావించడం ఆయన రాజీనామా చేయడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వారి అడ్డుతొల‌గించుకునేందుకు సీనియర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ యువనేతలు పార్టీని వీడుతున్నారు. వీటిని రాహుల్ - సోనియా తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

రాహుల్ విపాసన కార్యక్రమం.. ఆయన సెకండ్ ఇన్సింగ్స్‌ కు ప్రారంభమని నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం హర్యానా - మహారాష్ట్రలో పార్టీకి ఓటమి తప్పదు. ఎన్నికల ముంగిట - ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. ఈ ఓట‌మితో సీనియ‌ర్ల‌కు చెక్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారని అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో - పార్టీ ప‌గ్గాలు రాహుల్ చేప‌ట్టాల‌నే డిమాండ్ సైతం ప్ర‌ధానంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.