Begin typing your search above and press return to search.

ఇంకెన్నేళ్లు ప‌డుతోంది సోనియాజీ!

By:  Tupaki Desk   |   12 April 2017 6:19 AM GMT
ఇంకెన్నేళ్లు ప‌డుతోంది సోనియాజీ!
X
క్యాలెండ‌ర్లో ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోతున్నా.. కాంగ్రెస్ కు సంబంధించిన రెండు అంశాలు మాత్రం క్లారిటీ రాని ప‌రిస్థితి. కాంగ్రెస్ అధినేత్రి సోనియ‌మ్మ‌కు వ‌య‌సు మీద ప‌డిపోతున్న వేళ‌.. పార్టీకి కొత్త జ‌వ‌స‌త్వాలు తీసుకొచ్చేందుకు.. నాయ‌క‌త్వ మార్పు మీద కొన్నేళ్లుగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అదిగో.. ఇదిగో అంటూ కాల‌యాప‌నే త‌ప్పించి.. నిర్ణ‌యం తీసుకున్న‌ది లేదు. ఇదొక ముచ్చ‌ట అయితే.. కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చ‌ట మీదా అదే తంతు.

నెత్తి మీద‌కు ఫార్టీ ప్ల‌స్ అయినా.. స్టిల్ ఇప్ప‌టికి బ్యాచుల‌ర్ స్టేట‌స్ తో బండి లాగించేస్తున్న రాహుల్‌ కు పెళ్లి ఎప్ప‌టికి అయ్యేనూ అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇది కాస్త ప‌ర్స‌న‌ల్ మ్యాట‌రే అయినా.. కాంగ్రెస్ నేత‌లు మొద‌లుకొని.. దేశ ప్ర‌జ‌ల్లో చాలామందికి రాహుల్ పెళ్లి ముచ్చ‌ట ఉంటుందా? ఉండ‌దా? అన్న సందేహం మాత్రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కానీ గెలిస్తే.. ప్ర‌ధాని పీఠం మీద రాహుల్ ను కూర్చోబెట్టాల‌న్న ప‌గ‌టి క‌ల‌ల్ని క‌న్న సోనియాకు.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన స‌మ‌య‌మే చిక్క‌లేద‌ని చెప్పాలి. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. మోడీ అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే.. రాహుల్ అందుకు భిన్నంగా కుంచించుకుపోతున్న ప‌రిస్థితి. దీంతో.. ఆయ‌న్ను ఏ విధంగా ఎలివేట్ చేయాలో అధినేత్రి నుంచి ఆమెకు స‌న్నిహితంగా ఉండే వారికి ఓ ప‌ట్టాన అంతుచిక్క‌ని ప‌రిస్థితి. ఈ మ‌ధ్య‌న అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రుల చుట్టూ తిరిగి.. బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌ని సోనియా.. తాజాగా పార్టీనేత‌ల‌కు విందు ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ ఎంపీలు.. ప‌లువురు ముఖ్య‌నేత‌లు హాజ‌ర‌య్యారు. పార్టీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తు జోరుగా సాగుతోంద‌ని.. అందులో భాగంగానే తాజా విందు కార్య‌క్ర‌మంగా చెప్పిన‌ప్ప‌టికీ.. క‌స‌ర‌త్తు మాత్రం ఆ విష‌యం మీద‌నే సాగుతోంద‌న్న మాట వినిపిస్తోంది. రాహుల్‌ కు ప‌గ్గాలు ఇచ్చేందుకు సోనియ‌మ్మ సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ సీనియ‌ర్ల‌లో మాత్రం ఈ విష‌యం మీద అసంతృప్తి ఉంద‌ని.. దాన్ని క్లియ‌ర్ చేసే ప‌నిలో సోనియ‌మ్మ ఉంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. విందు సంద‌ర్భంగా సోనియ‌మ్మ‌తో రెండు ముక్క‌లు మాట్లాడే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది మీడియా. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో నోరు విప్పిన సోనియా.. రాహుల్‌ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌కుండా ఎప్ప‌టి మాదిరే త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఎంత‌కూ వ‌ద‌ల‌ని మీడియా పుణ్య‌మా అని.. సోనియా నోరు విప్ప‌క త‌ప్ప‌లేదు. పార్టీ ప‌గ్గాలు రాహుల్‌ కు ఇచ్చే విష‌యం మీద ఆమె స్పందిస్తూ.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుస్తాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ మాట బాగానే ఉన్నా.. ఈ త‌ర‌హా మాట‌లు ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు విని.. విని విసిగిపోయార‌న్న వాస్త‌వాన్ని సోనియ‌మ్మ గుర్తిస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/