Begin typing your search above and press return to search.

డిల్లీ కాలుష్యం సోనియమ్మను భయపెట్టింది

By:  Tupaki Desk   |   7 Nov 2016 9:36 AM GMT
డిల్లీ కాలుష్యం సోనియమ్మను భయపెట్టింది
X
దేశ రాజధాని ఢిల్లీలో కోరలు చాచిన వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ.. అంతర్జాతీయంగా హెడ్ లైన్ న్యూస్ గా మారింది. వాయుకాలుష్యం ప్రమాదకర పరిస్థితికి చేరుకోవటంతో మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో పాటు.. అత్యవసరమైన పని ఉంటే తప్పించి ఢిల్లీ ప్రజలు బయటకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు.

ఈ హెచ్చరికల ప్రభావం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మీద పడింది. 69 ఏళ్ల సోనియా గడిచిన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. ఆ మధ్యన యూపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వారణాసికి వెళ్లిన సోనియా తీవ్ర అస్వస్థతకు గురి కావటం.. చేతికి శస్త్రచికిత్స జరపటం.. కొద్ది కాలంపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవటం తెలిసిందే. ఈ మధ్యనే కోలుకున్న ఆమె.. ప్రస్తుతం గొంతు నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. దీనికి సోనియా అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలో నెలకొన్ని ప్రమాదకర కాలుష్యం నేపథ్యంలో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. తొలుత పార్టీ సమావేశానికి హాజరవుతారని భావించినా.. వార్తల్లో కాలుష్య తీవ్రత ప్రమాదకర పరిస్థితికి చేరుకుందన్న సమాచారంతో రియాక్ట్ అయిన ఆమె.. పార్టీ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించారు. సోనియా గైర్హాజరీతో ఆమె స్థానాన్ని పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భర్తీ చేయటం గమనార్హం. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్.. పంజాబ్ లలో జరిగే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/