Begin typing your search above and press return to search.

సోనియా సెగ‌ల‌కు సుష్మాపై ప‌గే కార‌ణ‌మా...?

By:  Tupaki Desk   |   5 Aug 2015 10:53 AM GMT
సోనియా సెగ‌ల‌కు సుష్మాపై ప‌గే కార‌ణ‌మా...?
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గురించి బాగా తెలిసిన వారు ఆమెది పాము పగ అంటుంటారు.. అంతెందుకు మన తెలుగు బిడ్డ పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు భరించానని చెప్పారంటూ ఇటీవల కాలంలో సంచలనం రేపిన పుస్తకాల్లో వచ్చింది. ఆమె నియంతని... తనను ఎవరైనా ఏమైనా అంటే పగ తీర్చుకుంటుందని చెబుతారు... గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాని పదవిని కాదనుకుని త్యాగం చేసినట్లుగా బిల్డప్ ఇచ్చే ఆమె ఆ స్థానంలో మన్మోహన్ సింగును కూర్చోబెట్టి బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఎలా చేశారో కూడా తెలిసిందే.. తాజాగా ఆమె కేంద్రంలో మంత్రి సుష్మాస్వరాజ్ , బీజేపీ సీఎంలు వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామా కోరుతూ పార్లమెంటును అడ్డుకుంటున్నారు.

నిజానికి మధ్య ప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం మినహా సుష్మ, వసుంధర రాజెల అక్రమాలో..అవినీతో..ఆశ్రిత పక్షపాతమో ఏదైనా సరే అది యూపీయే కాలంలోని బొగ్గు, 2జీ కుంభకోణాలతో పోల్చితే చాలా చిన్నవి. బ‌హుశా ఈ కార‌ణం వ‌ల్లేనేమో విపక్షాలేవీ తొలుత కాంగ్రెస్ తో క‌లిసి రాలేదు... అయితే... 25 మంది ఎంపీల‌ను స‌స్పెండు చేసిన త‌రువాత ఆ రీజ‌న్ తో అవి కాంగ్రెస్ తో జ‌త క‌లిశాయి. దీనికోసం సోనియా అండ్ కో విప‌క్షాల‌ను త‌మ‌తో క‌లుపుకొని వెళ్లేందుకు చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే... సోనియా టార్గెట్ వేర‌ని బీజేపీ, రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అవినీతి అంశాల‌ను బేస్ చేసుకుని ఆమె పార్ల‌మెంటులో ఆందోళ‌న చేస్తున్నా ఆమె లక్ష్యం మాత్రం కేవ‌లం సుష్మాస్వ‌రాజేన‌ని తెలుస్తోంది. దీనికి గ‌త నేప‌థ్యాన్నీ రాజ‌కీవ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప‌దేళ్ల కిందటి సంఘ‌ట‌న‌ల‌ను, స‌వాళ్ల‌ను త‌వ్వితోడుతున్నాయి.

2004లో యూపీఏ అధికారం చేప‌ట్టే స‌మ‌యంలో సోనియా ప్ర‌ధాని కావాల‌నుకున్నారు. దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆమె మ‌న్మోహ‌న్ ను ప్ర‌ధానిని చేశారు. ఆమె జాతీయ‌ను చూపి బీజేపీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తంచేసింది. అంతేకాదు... ఆ స‌మ‌యంలో సుష్మా తీవ్ర వ్యాఖ్య‌లు చేసి సోనియా ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వంపై పెద్ద చ‌ర్చ‌కు తెర‌తీశారు సోనియా క‌నుక ప్ర‌ధాని అయితే తాను గుండు గీయించుకుంటాన‌ని 2004లో ఆమె శ‌ప‌థం పూనారు. దీన్ని సోనియా వ్య‌క్తిగ‌తంగా తీసుకున్నారు... అయితే.. సుష్మ‌ను ఇరుకున పెట్టేందుకు అప్ప‌టినుంచి ఆమెకు ఇంత‌వ‌ర‌కు అవ‌కాశం దొర‌క‌లేదు. తాజాగా ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారంలో సుష్మాపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో సోనియాకు అవ‌కాశం వ‌చ్చింది. అప్ప‌టి ప‌గ‌ను తీర్చుకునేందుకు ఇదే స‌ర‌యిన స‌మ‌యంగా భావించి ఆమె పార్ల‌మెంటు వేదిక‌గా సుష్మ రాజీనామాకు ప‌ట్టుప‌డుతున్నారు.

అయితే... ఆమె ఒక్క‌రినే ఫోక‌స్ చేస్తే ఇదంతా బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో వ‌సుంధ‌ర రాజె, శివ‌రాజ్ సింగ్‌ల‌నూ క‌లుపుతూ పార్ల‌మెంటు కార్య‌క‌లాపాల‌కు అడ్డంప‌డుతున్నారు. 2004 నాటి ప‌రిణామాల నేప‌థ్యంలో సోనియా ఇంత‌గా ప‌ట్టుప‌డుతున్నార‌ని... సుష్మ‌ను ఇరుకున‌పెట్ట‌డ‌మే ఆమె ధ్యేయ‌మ‌ని ఢిల్లీలోని రాజ‌కీయ వ‌ర్గాలు ఘోసిస్తున్నాయి. లేదంటే యూపీఏ కాలం నాటి బొగ్గు కుంభ‌కోణం... 2జీ స్కాం, గ‌నుల కేటాయింపులు వంటి ఎన్నో కుంభ‌కోణాల‌తోపోల్చి చూస్తే ఇది తేలిపోతుంద‌ని... సోనియా స్థాయిలో ఆందోళ‌న చేయ‌ద‌గ్గ అంశ‌మే కాద‌ని విశ్లేషిస్తున్నారు. సుష్మ‌ను టార్గెట్ చేసుకునే సోనియా ఇదంతా చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.