Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో కొత్త చరిత్ర సృష్టించనున్న సోనియా

By:  Tupaki Desk   |   19 Dec 2015 9:23 AM GMT
కాంగ్రెస్ లో కొత్త చరిత్ర సృష్టించనున్న సోనియా
X
కోర్టు బోను ఎక్కనున్న తొలి కాంగ్రెస్ అధ్యక్షులుగా సోనియా గాంధీ చరిత్రకెక్కనున్న నేపథ్యంలో ఆమె పార్టీకి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఏ నేతా కోర్టు బోనెక్కలేదు. సోనియా గాంధీ ఇప్పుడు తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కోర్టు బోనులో నిల్చోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టులోకి రానుండడంతో ఆమె బోనెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే... సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ చరిత్రకు మచ్చ రాకుండా సోనియా రాజీనామా చేస్తారని కొందరు ఊహిస్తున్నా ఆమె తత్వం తెలిసినవారు మాత్రం అదేమీ ఉండదని కొట్టి పారేస్తున్నారు. 1997 పీవీ నరసింహరావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోర్టు బోను ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే, పార్టీ గౌరవానికి భంగం కలగరాదన్న ఉద్దేశంతో ఆయన కోర్టుకు వెళ్లడానికి ముందు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సోనియా అలా చేస్తారా లేదా అన్నది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కాగా నేషనల్ హెరాల్డ్ కేసు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పాటియాలా కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ లవ్లీన్ బెంచి ఈ కేసును విచారించనుంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత సోనియా - రాహుల్ లు కోర్టుకు చేరుకుంటారు. ఇప్పటికే రాహుల్ సోనియా నివాసానికి చేరుకున్నారు. సోనియా - రాహుల్ ల తరఫున కాంగ్రెస్ నేతలైన ప్రముఖ న్యాయవాగులు కపిల్ సిబల్ - అభిషేక్ సింఘ్విలు వాదించనున్నారు.