Begin typing your search above and press return to search.

సోనియా రాక‌తో టీకాంగ్రెస్ రాత మారుతుందా?

By:  Tupaki Desk   |   22 Nov 2018 7:45 AM GMT
సోనియా రాక‌తో టీకాంగ్రెస్ రాత మారుతుందా?
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. అన్ని పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ రోజుకు 5-6 బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడుతూ జోరు మీదున్నారు. కాంగ్రెస్‌-టీడీపీ పొత్తుపై ఆయ‌న‌ విమ‌ర్శ‌ల క‌త్తులు దూస్తున్నారు. మ‌హా కూట‌మిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు.

కాంగ్రెస్‌ లో మాత్రం ప‌రిస్థితి ఇందుకు కాస్త విరుద్ధంగా ఉంది. రెబ‌ల్స్ దెబ్బ‌కు ఆ పార్టీ అభ్య‌ర్థులు ఇంకా పూర్తిస్థాయి ప్ర‌చారానికి వెళ్ల‌ట్లేదు. ఈ ప‌రిస్థితుల్లో సోనియా గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న ఇక్క‌డి కాంగ్రెస్ నేత‌ల‌కు ఓ వెలుగు రేఖ‌లా క‌నిపిస్తోంది. సోనియా రాక‌తో త‌మ రాత‌లు మారుతాయ‌ని - అస‌మ్మ‌తులు తొల‌గిపోయి ప్ర‌చార‌ప‌ర్వం జోరందుకుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఈ నెల 23న మేడ్చ‌ల్‌ లో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో క‌లిసి ఆయ‌న త‌ల్లి సోనియా గాంధీ పాల్గొన‌నున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన‌ టీఆర్ ఎస్ పోరాటం కీల‌క‌మైన‌దేన‌ని.. అయితే, ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘ‌న‌త మాత్రం సోనియా గాంధీదేన‌ని ప‌లువురు చెబుతుంటారు. ప్ర‌ధానంగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఈ విష‌యాన్ని నొక్కిచెబుతుంటారు. రాష్ట్ర ప్ర‌ధాత‌గా సోనియాపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో గౌర‌వం ఉంద‌నేది కూడా కాద‌న‌లేని వాస్త‌వం. కాబ‌ట్టి ఆమె ప‌ర్య‌ట‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌తాన్ని గుర్తుచేస్తుంద‌ని - ఫ‌లితంగా ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూప‌డం ఖాయ‌మ‌ని టీకాంగ్రెస్ నేత‌లు ఆశిస్తున్నారు.

నిజానికి తెలంగాణ ప్ర‌ధాత‌గా పేరుగాంచిన సోనియా.. ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డాక రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రానుండ‌టం ఇదే తొలిసారి. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆమె కేసీఆర్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకోసం ఇచ్చామో వివ‌రించే అవ‌కాశ‌ముంది. తాము కోరుకున్న ప్ర‌గ‌తి రాష్ట్రంలో చేటుచేసుకోవ‌డం లేద‌ని.. అందుకే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు గుప్పించే సూచన‌లున్నాయి. మైనారిటీ ఓట్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవ‌డంలోనూ సోనియా ప‌ర్య‌ట‌న దోహ‌ద‌ప‌డుతుంద‌ని టీపీసీసీ నేత‌లు భావిస్తున్నారు.