Begin typing your search above and press return to search.

కేసీఆర్ అండ్ కో మీద‌కు సోనియా ఆస్త్రం!

By:  Tupaki Desk   |   27 Sep 2018 6:11 AM GMT
కేసీఆర్ అండ్ కో మీద‌కు సోనియా ఆస్త్రం!
X
అమ్మ కాదు.. బొమ్మ‌. దేవ‌త కాదు దెయ్యం. ఇలా సాగుతున్నాయి కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు.. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీని ఉద్దేశించి టీఆర్ఎస్ నేత‌ల మాట‌లు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌సాదించిన అమ్మ‌గా ఒక‌ప్పుడు కేసీఆర్ సైతం కొలిచిన వైనం ఇప్పుడు పాత‌దైంది. అంతేనా.. తెలంగాణ ఇచ్చిన నేప‌థ్యంలో సోనియ‌మ్మ ఇంట్లో ఇచ్చిన విందు కోసం ఏకంగా త‌న కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి.. ఫోటోలు సైతం దిగిన కేసీఆర్ పుణ్య‌మా అని తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు త‌మ‌కు మించినోళ్లు లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కాంగ్రెస్ నేత‌లు.. ఆ ప‌వ‌ర్ ఏ మాత్రం చేజారినా ఆగ‌మాగం అవుతుంటారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి. నాలుగున్న‌రేళ్లుగా విప‌క్షంలో ఉండి అధికార‌ప‌క్షాన్ని ఒక ఆట ఆడుకోవాల్సి ఉన్నా.. అలాంటిదేమీ చేయ‌లేక చ‌తికిల ప‌డిన ప‌రిస్థితి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలే కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రం కంచుకోట‌గా మారుతుందంటూ పార్టీ అధినాయ‌క‌త్వం ముందు హ‌డావుడి చేసిన నేత‌లు ఎవ‌రూ ఇప్పుడు చ‌ప్పుడు చేయ‌ని ప‌రిస్థితి. కేసీఆర్ సంగ‌తేముంది? మేం చేసుకుంటామ‌న్న పెద్ద మ‌నుషులు సైతం ఇప్పుడు నోటికి ప్లాస్ట‌ర్లు వేసుకున్న‌ట్లుగా గ‌మ్మున ఉండిపోవ‌టంతో తాము న‌మ్మిన నేత‌ల అస‌లు స‌త్తాను కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇప్పుడు బాగా అంచ‌నా వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈసారి ఎన్నిక‌ల ప్ర‌చారానికి తానే స్వ‌యంగా రాష్ట్రానికి రావాల‌న్న ఆలోచ‌నను సోనియ‌మ్మ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ లాంటి పార్టీని ఎన్నిక‌ల్లో ఎదుర్కోవాలంటే అమ్మ సెంటిమెంట్ మాత్ర‌మే కాదు.. అమ్మ‌ను తెలంగాణ‌కు తీసుకొచ్చి నాలుగైదు స‌భ‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈసారి తెలంగాణ ప్ర‌జ‌ల‌పైన సోనియ‌మ్మ అస్త్రాన్ని ప్ర‌యోగించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందే స‌భ‌ల్ని పెట్టేసి.. ఒక‌సారి షెడ్యూల్ విడుద‌ల చేసిన త‌ర్వాత మ‌రోసారి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం కూడా సోనియ‌మ్మ‌ను తీసుకురావాల‌న్న సంక‌ల్పం పార్టీలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. త‌న చేతులు మీదుగా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు తెలంగాణ వాదులు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి. సోనియ‌మ్మ కానీ తెలంగాణ‌లో తిరిగి.. తాను ఇచ్చిన తెలంగాణ అన్న మాట ఆమె నోటి నుంచి వ‌స్తే.. ఫ‌లితం త‌మ‌కు సానుకూలంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి..కాంగ్రెస్ సంధిస్తున్న అమ్మ అస్త్రానికి తెలంగాణ ప్ర‌జ‌లు ఎంత మేర ఓటు వేస్తారో చూడాలి.