Begin typing your search above and press return to search.

సోనియమ్మ పరిస్థితి ఇంత దయనీయమా?

By:  Tupaki Desk   |   28 Oct 2015 5:54 AM GMT
సోనియమ్మ పరిస్థితి ఇంత దయనీయమా?
X
పవర్ చేతిలో ఉన్న పదేళ్లు కాంగ్రెస్ అధినేత్రి రేంజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని జనాకర్షక నేతగా ఉన్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతకు అమ్మ అపాయింట్ మెంట్ దొరకాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఢిల్లీలో ఉండి.. రాష్ట్ర వ్యవహాలపై అధిష్ఠానం ఆలోచనల్ని పసిగట్టేందుకు ఏర్పాటు చేసుకున్న వైఎస్ బ్యాచ్ ఇలాంటి విషయాలు చూసుకునేవాళ్లు.

సోనియమ్మ అపాయింట్ మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దొరకదా? అని కొందరు విస్మయం వ్యక్తం చేస్తారు కానీ.. సోనియమ్మ కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఏపీ ఒకటి మాత్రమేనన్న విషయం మర్చిపోకూడదు. కాకుంటే.. పెద్ద రాష్ట్రం కాబట్టి హర్యానా.. హిమాచల్ ప్రదేశ్.. ఒడిశాలతో పోలిస్తే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంతే.

ముఖ్యమంత్రులు సైతం అమ్మ దర్శనం కోసం.. అమ్మ మాట వినేందుకు క్యూలో వేచి చూసే పరిస్థితి. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనటానికి తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన మాట కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురుచూసే అమ్మ.. ఇప్పుడు ఒక ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఒప్పించేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. ఇదొక్కటి చాలు.. అమ్మ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలియజెప్పటానికి.

వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దించటానికి వివేక్ అన్ని విధాల అర్హుడన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన. అయితే.. అందుకు వివేక్ సిద్ధంగా లేరు. అమ్మ టిక్కెట్టు ఇస్తానని చెప్పాలే కానీ.. ఎనీ సెంటర్ అన్న పరిస్థితి ఉండేది. మారిన పరిస్థితుల కారణంగా ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు వివేక్ ససేమిరా అంటున్నారు. ఆయన్ని ఒప్పించేందుకు తాజాగా ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. బుధవారం అమ్మ నుంచి కబురు వస్తుందని.. ఆ వెంటనే కలవాల్సి ఉంటుందని.. అందుకు సిద్ధంగా ఉండాలంటూ వివేక్ కు సమాచారం అందించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులు సైతం అమ్మ దర్శనం కోసం క్యూ కట్టే పరిస్థితి నుంచి.. అమ్మ టిక్కెట్టు ఇస్తానంటే.. నో చెప్పేసే పరిస్థితి. చివరకు అమ్మే రంగంలోకి వచ్చి.. తన వద్దకు పిలిపించుకొని మరీ ఒప్పించే పరిస్థితి చూస్తే.. సోనియమ్మ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.