Begin typing your search above and press return to search.

బాబుకు అమ్మ శుభాకాంక్షలు

By:  Tupaki Desk   |   19 Oct 2015 4:33 AM GMT
బాబుకు అమ్మ శుభాకాంక్షలు
X
రాజకీయాలు రాజకీయాలే.. శుభాకాంక్షలు శుభాకాంక్షలే. ఎప్పుడు ఏది చేయాలో.. ఎలా చేయాలో తల పండిన రాజకీయ నేతలకు బాగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పాపానికి ఏపీలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయిన దానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎంతగా ఫీల్ కావాలి. పదేళ్లు నాన్ స్టాప్ గా అధికారాన్ని అనుభవించిన పార్టీ.. ఇప్పుడు అడ్రస్ కూడా లేకుండా పోవటం అంత పెద్ద పార్టీ అధినేత్రిగా ఎంత ఆవేశ పడిపోవాలి. అధికారంలో ఉన్న పార్టీ పట్ల ఎంత ఆగ్రహం ఉండాలి.

కానీ.. ఎప్పుడేం చేయాలో సోనియాగాంధీ లాంటి వారికి తెలీకుండా ఉంటుందా? ఏపీ విపక్ష నేత జగన్ మాదిరి.. ప్రజల పండుగైన శంకుస్థాపన కార్యక్రమానికి తాను రానని.. తనను అస్సలు పిలవొద్దని.. తాను పిలవొద్దని చెప్పిన తర్వాత పిలిచి.. ఆ తర్వాత బండలేసే కార్యక్రమం చేపట్టొద్దంటూ బహిరంగ లేఖ రాసిన జగన్ లాంటి వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లాంటి వారి మాటలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపిన చంద్రబాబు ఇన్విటేషన్ పై సోనియాగాంధీ స్పందించారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిఢవిల్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రెండు వేల ఏళ్ల కిందట నుంచే అమరావతికి ఘన చరిత్ర ఉందని.. ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది.. ప్రపంచ రాజధానిగా తయారు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పవర్ లో లేకున్నా.. ఇంటికి వచ్చి శుభకార్యానికి ఆహ్వానించే వారిని సాదరంగా ఆహ్వానించటం.. వారికి శుభాకాంక్షలు చెప్పటం లాంటి విషయాలు ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియమ్మకు తెలిసినంతగా జగన్ కు తెలీవా? రాజకీయాల్లో తల పండిన ఒకప్పటి అమ్మ లాంటి సోనియమ్మ మాటలు జగన్ తలకెక్కుతాయా?