Begin typing your search above and press return to search.

శ‌బ‌రి ఆలయంలోకి మ‌రో మ‌హిళ‌..ఎంపీల‌కు సోనియా వార్నింగ్‌

By:  Tupaki Desk   |   4 Jan 2019 11:51 AM GMT
శ‌బ‌రి ఆలయంలోకి మ‌రో మ‌హిళ‌..ఎంపీల‌కు సోనియా వార్నింగ్‌
X
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన అంశం మ‌లుపులు తిరుగుతోంది. ఈ రోజు శబరిమల ఆలయంలోకి మరో మహిళ ప్రవేశించారు. గురువారం రాత్రి శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ పవిత్ర పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోకి చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ.. గురువారం రాత్రి 10:55 గంటల సమయంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు ధృవీకరించారు. కోజికోడ్ కు చెందిన బిందు(42) - కనకదుర్గ(44)లు కలిసి బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నప్పటికీ పదునెట్టాంబడి మాత్రం ఎక్కలేదు. వీరిద్దరూ అయ్యప్ప మాల ధరించినప్పటికీ సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకున్నారు. శశికళ మాత్రం పడి మెట్లు మీదుగా ఆలయంలోకి వెళ్లడం గమనార్హం. గురువారం సాయంత్రం పంబా బేస్ క్యాంప్ కు చేరుకున్న శశికళకు డీఎస్పీ కేడర్ అధికారి ఆధ్వర్యంలో రెండు బృందాలు భద్రత కల్పించాయి. అయితే శశికళ దర్శనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దర్శనం చేసుకున్నట్లు కేరళ సీఎంవో వర్గాలు నిర్ధారించగా - దర్శనం చేసుకోలేదని శశికళతో పాటు ఆమె భర్త పేర్కొన్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ తమ ఎంపీలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. ఇవాళ పార్లమెంట్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కానీ సోనియా గాంధీ ఆ ఎంపీలను అలా చేయకుండా నివారించారు. కేరళలో జరుగుతున్న బ్లాక్ డే ఆందోళనలకు నిజానికి ఎంపీలు సంఘీభావం తెలుపాలని నిర్ణయించుకున్నారు. కానీ సోనియా ఆ అంశంపై ఓ స్పష్టమైన వార్నింగ్ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయంతో ఉందని, అందుకే పార్లమెంట్‌ లో అలాంటి నిరసన వద్దు అని తమ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరసనలు కేవలం కేరళ రాష్ర్టానికి పరిమితం చేయాలని సోనియా తన ఆదేశాల్లో ఆ పార్టీ ఎంపీలకు క్లియర్ చేశారు. అయితే శబరిమల అంశంపై ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామని కేపీసీసీ ప్రెసిడెంట్ ముల్లపల్లి రామచంద్రన్ తెలిపారు.