Begin typing your search above and press return to search.

సోనియా రాజ‌కీయ స‌న్యాసం చేయ‌ట్లేద‌ట‌!

By:  Tupaki Desk   |   15 Dec 2017 10:30 AM GMT
సోనియా రాజ‌కీయ స‌న్యాసం చేయ‌ట్లేద‌ట‌!
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజ‌కీయ స‌న్యాసం ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గానే మారిపోయింది. తీవ్ర అనారోగ్య కార‌ణాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సోనియా... కొద్దికాలంగా పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా లేని మాట వాస్త‌వ‌మే. ఈ క్ర‌మంలోనే పార్టీ ఉపాధ్య‌క్షుడిగా సోనియా కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. రేపు ఆయ‌న త‌న త‌ల్లి చేతుల్లో నుంచి పార్టీ ప‌గ్గాల‌ను అందుకోనున్నారు. ఈ క్ర‌మంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై సోనియా గాంధీ నేటి ఉద‌యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. రాహుల్ గాంధీకి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌ర్వాత తాను రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటాన‌ని స్వ‌యంగా సోనియానే ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న నిజంగానే దేశ రాజ‌కీయాల్లో పెను క‌ల‌క‌లంగానే మారిపోయింది. ఎందుకంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ కు అత్య‌ధిక కాలం పాటు అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించిన సోనియా ఉన్న‌ప‌ళంగా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటే పార్టీ ప‌రిస్థితి ఏమిట‌న్న ఆందోళన కూడా పార్టీ నేత‌ల్లో వ్య‌క్త‌మైంది.

ఈ క్ర‌మంలో కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. పార్టీని విజ‌య తీరాల‌కు చేర్చిన సోనియా గాంధీ రాజ‌కీయ స‌న్యాసం చేయ‌బోవడం లేద‌ని - కేవ‌లం అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి మాత్ర‌మే త‌ప్పుకుంటార‌ని... స్వ‌యంగా సోనియా చేసిన ప్ర‌క‌ట‌న‌ను మార్చేసి చెప్ప‌డం ప్రారంభించారు. ఈ ప్ర‌క‌ట‌న చేసింది ఏ కుర్ర నేత‌లో అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే... ఈ ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌క్తి మ‌న తెలుగు నేల‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ మోస్ట్‌ గా ఉన్న ఎస్‌.జైపాల్ రెడ్డితో పాటు ఏఐసీసీ అదికార ప్ర‌తినిధిగా ఉన్న ర‌ణ‌దీప్ సూర్జేవాలాలు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. పార్టీ అధిష్ఠానానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ కూడా మీడియాకు చెప్పే ర‌ణ‌దీప్ సూర్జేవాలా అంద‌రి కంటే ముందుగా స్పందించిన విష‌యాన్ని ఇక్క‌డ ప్రధానంగా ప్ర‌స్తావించుకోవాలి.

రాహుల్ గాంధీకి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన త‌ర్వాత సోనియా గాంధీ రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నున్నార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని సూర్జేవాలా పేర్కొన్నారు. పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి మాత్ర‌మే సోనియా గాంధీ త‌ప్పుకుంటార‌ని, రాజ‌కీయాల్లో ఆమె ఇక‌పైనా కొన‌సాగుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక జైపాల్ రెడ్డి ప్ర‌క‌ట‌న విష‌యానికి వ‌స్తే... సోనియా గాంధీ రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నున్నార‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. రాహుల్ గాంధీ ముందు న‌డుస్తుంటే... సోనియా దిశానిర్దేశం చేస్తార‌న్న కోణంలో త‌న‌దైన శైలి ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన జైపాల్... సోనియా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా బల్ల గుద్ది మ‌రీ చెప్పేశారు. రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు స్వ‌యంగా సోనియానే ప్ర‌క‌ట‌న చేస్తే.. ఆ ప్ర‌క‌ట‌న వాస్త‌వం కాదంటూ సూర్జేవాలా, జైపాల్ రెడ్డిలు చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు జ‌నాన్ని అయోమ‌యంలో ప‌డేశాయ‌నే చెప్పాలి. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.