Begin typing your search above and press return to search.

మనమ్మాయ్.. అంత పెద్ద కంపెనీకి సీఈవో

By:  Tupaki Desk   |   8 March 2020 4:26 AM GMT
మనమ్మాయ్.. అంత పెద్ద కంపెనీకి సీఈవో
X
ఊరు కాని ఊరు వెళితేనే అదో కష్టం. రాష్ట్రం కాని రాష్ట్రంలో కుదురుకోవటమే కష్టం. అక్కడితో ఆగకుండా.. అంతకంతకూ ఎదగటం.. అక్కడున్న పోటీని అధిగమించి.. అందరిలో తాను ప్రత్యేకంగా నిలవటం అషామాషీ వ్యవహారం కాదు. ఇవే పెద్ద సమస్యలనుకుంటే.. దేశం కాని దేశం వెళ్లటం.. అక్కడ తన సత్తా చూపటం.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పోటీని తట్టుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవటం చాలా కష్టమైన.. క్లిష్టమైనది.

తాజాగా అలాంటి గెలుపునే సొంతం చేసుకున్నారు భారత మూలాలు ఉన్న సోనియా సింగాల్. 49 ఏళ్ల ఈ భారత మూలాలు ఉన్న మహిళ ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకదానికి సీఈవోగా ఎంపిక కావటం గమనార్హం. ఇంద్రానూయి తర్వాత.. ఆమెను గుర్తుకు తెచ్చే ఘనతను సొంతం చేసుకోవటం విశేషం.

ఫార్చూన్ 500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’కు ఆమె సీఈవోగా ఎంపికయ్యారు. ఆ కంపెనీ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు కావటం గమనార్హం. అమెరికాతో సహా పలు దేశాల్లో 3727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో మొత్తంగా 1.35 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

గతంలో ఆమె సన్ మైక్రో సిస్టమ్స్.. ఫోర్డ్ మోటార్స్ లో పదిహేనేళ్ల పాటు పని చేశారు. 2004లో గాప్ ఇంక్ లో పని చేసిన ఆమె పలు కీలక స్థానాల్ని విజయవంతంగా నిర్వహించారు. భారత్ లోనే పుట్టిన సోనియా.. చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ.. ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. దేశంలోని యూత్ కు.. సోనియా యూత్ ఐకాన్ గా నిలుస్తారనటంలో సందేహం లేదు.