Begin typing your search above and press return to search.

సీఎంతో సోనుసూద్ భేటీ: రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు చెక్‌

By:  Tupaki Desk   |   8 Jun 2020 11:30 AM GMT
సీఎంతో సోనుసూద్ భేటీ: రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు చెక్‌
X
మ‌హమ్మారి వైర‌స్ వ్యాప్తితో లాక్‌డౌన్ విధించ‌గా పేద‌లు, వ‌ల‌స కూలీలు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. వారిని ఎవ‌రికి తోచిన‌ట్టు వారు స‌హాయం చేశారు. అయితే దేశ‌వ్యాప్తంగా తెలంగాణ ఎమ్మెల్యే సీత‌క్క, ‌బాలీవుడ్‌ నటుడు సోనుసూద్ మ‌రికొంద‌రు తీవ్రంగా శ్ర‌మించి పేద‌ల‌కు అండ‌గా నిలిచి స‌హాయ కార్య‌క్ర‌మాలు చేశారు. వారంతా లాక్‌డౌన్ స‌మ‌యంలో హీరోలయ్యారు. అయితే ఇలాటి సేవ చేసే వారిపై కూడా విమ‌ర్శ‌లు రావ‌డం దారుణం. ఈ క్ర‌మంలోనే సోనుసూద్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఈ విధంగా సోను సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడ‌ని శివసేన పార్టీ ఆరోపించింది. దీనికితోడు అత‌డి వెంట బీజేపీ ఉంద‌ని, సోనును ప్రోత్స‌హిస్తోంద‌ని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌మ పార్టీ ప‌త్రిక సామ్నాలో సోనుసూద్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ్యాసం ప్ర‌చురించారు. అయితే అవేవి ఉన్నా ఆది‌వారం రాత్రి ఒక్క‌సారిగా ప‌రిణామాలు మారాయి.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన పార్టీ అధినేత ఉద్ద‌వ్ ఠాక్రేతో సోనుసూద్ సోమ‌వారం స‌మావేశ‌మ‌య్యాడు. మంత్రి ఆదిత్యా ఠాక్రే సోనును తీసుకుని ఆదివారం రాత్రి ముఖ్య‌మంత్రిని క‌లిపించారు. ఈ సందర్భంగా వారి స‌మావేశంలో సోనుసూద్ లాక్‌డౌక్ స‌మ‌యంలో చిక్కుకుపోయిన వలస కార్మికులకు చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాల‌ను ముఖ్య‌మంత్రి అభినందించారు. ఈ విష‌యాన్ని సొనుసూద్ ట్వీట్ట‌ర్‌లో తెలిపారు.

‘ముఖ్యమంత్రి ఠాక్రే, మంత్రి ఆదిత్యతో సమావేశమైనందుకు సంతోషంగా ఉంది. వలస కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటా. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటా. భవిష్యత్‌లో కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అని ట్వీట్ చేశాడు. తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు చెక్‌ పెట్టేందుకే ఠాక్రేతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

అయితే శివ‌సేన ప‌త్రిక సామ్నాలో త‌న‌పై క‌థ‌నం ప్రచురితమైన రోజే ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం ఆస‌క్తిగా మారింది. అంటే ఆ విమ‌ర్శ‌లు రావ‌డంతో వెంట‌నే సోనుసూద్ స్పందించి సీఎంతో భేటీ అయ్యార‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా స‌మావేశంలో ప‌త్రిక‌లో వ‌చ్చిన వ్యాసం విష‌యమై చర్చకు వ‌నట్లు తెలిసింది. వలస కార్మికులకు అండగా నిలుస్తున్న తనకు రాజకీయ రంగు పులమడం సరైనది కాదని చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో త‌న స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు ప్రభుత్వం కూడా స‌హ‌క‌రిస్తే భవిష్యత్‌లో మ‌రిన్ని కార్యక్రమాలు చేస్తానని ముఖ్య‌మంత్రికి సోనుసూద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.