Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నుంచి సోనూసుద్ పోటీ..! ఎక్కడినుంచో తెలుసా..?

By:  Tupaki Desk   |   24 Aug 2021 7:06 AM GMT
కాంగ్రెస్ నుంచి సోనూసుద్ పోటీ..! ఎక్కడినుంచో తెలుసా..?
X
గత పదేళ్లుగా ప్రతీ ఎన్నికల్లో నిరాశ ఎదురవుతున్న కాంగ్రెస్ కు మంచిరోజులు రాబోతున్నాయి..! ఓ వైపు మోదీ పాలనపై వ్యతిరేకత.. మరోవైపు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీలో స్తబ్ధంగా ఉన్నవాళ్లు సైతం పార్టీ కోసం శ్రమించడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరనుందా..? అన్న చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగే ప్రతీ ఎన్నికను సద్వినియోగం చూసుకోవాలని చూస్తోంది. చిన్న చిన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతాపం చూపించి, 2024లో జరిగే ఎన్నికల బరిలో ఈ గెలుపును వాడుకోవాలని చూస్తున్నారు ఆ పార్టీ నాయకులు.

బాంబే మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దశాబ్దాలుగా బీజేపీతో కలిసి శివసేననే గెలుస్తూ వస్తోంది. 2017లో ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ సీట్లను దక్కించుకుంది శివసేన. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో అధికారంలో కూర్చొంది. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్,ఎన్సీపీలతో కలిసి పోటీ చేస్తుందా..? లేదా..? అన్నది తెలియడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేస్తే ఏం చేయాలన్నదానిపై ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించారు ఆ పార్టీ నేతలు.

ఇందులో భాగంగా ముంబై కాంగ్రెస్ సెక్రటరీ గణేశ్ 25 పేజీల ఓ స్ట్రాటజీ డాక్యుమెంట్ ను రూపొందించారు. దీనిని తర్వలోనే మహారాష్ట్ర ఏఐసీసీ సెక్రటరీకి ఇన్ చార్జి హెచ్ కె పాటిల్ కు అందిస్తారని సమాచారం. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ ముంబై కాంగ్రెస్ అధ్యక్షఉడు భాయ్ జగ్ తాప్ పార్టీ సీనియర్లతో కలిసి ఈ డాక్యుమెంట్ పై చర్చిస్తామని తెలిపారు. ఇందులో కార్పొరేటర్లు, మేయర్ అభ్యర్థి పేరును తెలిపామన్నారు. అయితే కొన్ని కార్పొరేషన్ సెంటర్లలో ప్రజల్లో, యూత్ లో బాగా ఆదరణ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. అయితే శివసేన తో కలిసి పోటీ చేయడమా..? లేక ఒంటరిగా పోటీ చేయడమా..? అన్నది ఇంకా తేలలేదని ఆయన చెప్పారు.

ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్లో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను పార్టీ తరుపున బరిలో ఉంచానలి చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో సాయం చేస్తూ అందరికీ ఆప్తుడైన సోనూసుద్ ను నిలబెట్టనున్నట్లు సమాచారం. ముంబైలో ఇప్పటికే సోనూసుద్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. మరోవైపు యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను తమ పార్టీలోకి తీసుకొని ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అయితే సోనూసుద్ ఇందుకు ఒప్పుకుంటాడా..? లేదా..? అన్నది తెలియరాలేదు.

మరో సెలబ్రెటీ, సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయకుడు రితేష్ దేశ్ ముఖ్ పేరు కూడా వినిపిస్తోంది. చాలా సినిమాల్లో నటించి రితేశ్ తండ్రి చనిపోయిన తరువాత కూడా రాజకీయాల్లోకి రాలేదు. అయితే యూత్ ఫాలోయింగ్ రితే శ్ కు బాగా ఉంది. దీంతో ఆయనను కాంగ్రెస్ లోకి తీసుకుంటే కలిసొస్తుందని అనుకుంటున్నారు. అయితే రితేశ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వారిని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంటున్నారు.

ఇప్పిటికే కాంగ్రెస్ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ లాంటి పేరున్న వ్యక్తులను కాంగ్రెస్ లోకి తీసుకుంటున్న అధిష్టానం ఇప్పుడు ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వారిని పార్టీ తరుపున నిలబెట్టాలని అనుకుంటున్నారు. మరి బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా..? లేదా..? అనేది చూడాలి.