Begin typing your search above and press return to search.

కోహ్లీ - ధోనీ మధ్యలో గంగూలీ!

By:  Tupaki Desk   |   21 Dec 2016 7:26 AM GMT
కోహ్లీ - ధోనీ మధ్యలో గంగూలీ!
X
టీం ఇండియా క్రికెట్ కు సంబందించి ఇప్పుడు విరాట్ కొహ్లీ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. అతని వ్యక్తిగత ఫెర్మార్మెన్స్ గురించి మాత్రమే ఇన్నాళ్లూ మాట్లాడిన వారంతా ఇప్పుడు తాజాగా అతడి కెప్టెన్సీ పై చర్చించుకోవడం మొదలుపెట్టారు. దానికి కారణం కూడా చాలా బలమైందికావడంతో మెజారిటీ సీనియర్లు కొహ్లీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే కథనాలు వస్తున్నాయి. అవును... తాజాగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుత విజయం అలాంటిది మరి. అంతేనా... వరుసగా 18 టెస్టుల్లో పరాజయం అన్నదే చూడకుండా కొహ్లీ సారధ్యంలోని టీం ఇండియా దూసుకుపోతుంది.

ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా విరాట్‌ కోహ్లి - మహేంద్రసింగ్‌ ధోనీ మధ్య మళ్లీ కెప్టెన్సీ పోరు తెరపైకి వచ్చింది. అయితే... ప్రస్తుతం వన్డేలు - టీ-20లకు ధోనీ నేతృత్వం వహిస్తుండగా - టెస్టులకు మాత్రం కొహ్లీ కెప్టెన్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న సమీకరణాల దృష్ట్యా ధోనీ ఆ నాయకత్వ పగ్గాలు కోహ్లికి అప్పగించి, అతడి నాయకత్వంలో ఆడక తప్పదంటూ టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీనియర్లకు - సెలక్షన్ కమిటీకి మీడియా నుంచి ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయాలపై గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు.

ఇకపై వన్డేలు - టీ-20లకు కూడా కోహ్లికి కెపెన్సీ బదలాయింపుపై స్పందించిన గంగూలీ... ప్రస్తుతం కొహ్లీ విజయవంతమవుతున్న తీరుచూస్తుంటే... సహజంగానే ధోనీపై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. ఇదే క్రమంలో.. టెస్టుల్లో కోహ్లి విజయం సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతుంది. ఒకరోజు అతను తప్పకుండా వన్డేలకు కూడా కెప్టెన్‌ అవుతాడు. కాకపోతే ఇంకా కొంతకాలం ఆగాలి. ఈ విషయంతో సెలెక్టర్లు కూడా 2019 వరల్డ్‌ కప్‌ కు ఎవరిని కెప్టెన్‌ గా నియమించాలనేదానిపై ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అని అన్నాడు. ఇదే సమయంలో ధోనీకి కూడా తనవంతుగా హింట్ ఇచ్చిన గంగూలీ... రానున్న ఇంగ్లండ్‌ వన్డే - టీ-20 సిరీస్‌ ధోనీకి చాలా కీలకం అని మీడియాకు తెలిపాడు. దీంతో చెప్పాలనుకున్న విషయం గంగూలీ మాగ్జిమం చెప్పేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/