Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా స్ట్రెయిన్ మూలాలు ... నిపుణుల హెచ్చరికలు

By:  Tupaki Desk   |   28 Dec 2020 6:00 AM GMT
ఏపీలో కరోనా స్ట్రెయిన్ మూలాలు ... నిపుణుల హెచ్చరికలు
X
యూకే‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారత్‌కు చేరుకున్నవారి విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అయితే అది కొత్త వైరస్‌ అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వారి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఆ పరీక్షలు ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

గత నెల రోజులుగా యూకే నుంచి 1214 మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని.. వారిలో ఇప్పటివరకు 1158 మందిని గుర్తించామని చెప్పారు. ఇంకా 56 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఇప్పటికే యూకే స్ట్రెయిన్ వైరస్‌ భయంతో గజగజలాడిపోతున్న ప్రజలకు.. ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్తలు మరో దడ పుట్టించే వార్తను చెప్పారు. ఆంధ్రపద్రేశ్‌ లో మరో కొత్త రకం కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఆ న్యూ వేరియంట్‌ కు N440K అని నామకరణం చేశారు. కరోనా పాజిటివ్స్‌లో మూడింట ఒక వంతులో ఈ వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్ 440కే రకం ఉన్నట్లు తేలింది. ఇటు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఈ ఎన్440కే వైరస్‌ వెలుగుచూసింది. అలాగే నోయిడాలో కూడా ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసును కూడా గుర్తించారు. భారత్‌ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టిన సమయంలో కరోనా స్ట్రెయిన్‌ వార్త మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలను కేంద్రం రద్దు చేసింది. గత కొన్ని రోజులుగా యూకే నుంచి వచ్చినవారిని గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.