Begin typing your search above and press return to search.

అట్టుడుకుతున్న‌ సౌతాఫ్రికా.. భార‌తీయుల‌పై య‌థేచ్ఛ‌గా దాడులు.. కార‌ణం వాళ్లేనా?

By:  Tupaki Desk   |   18 July 2021 8:31 AM GMT
అట్టుడుకుతున్న‌ సౌతాఫ్రికా.. భార‌తీయుల‌పై య‌థేచ్ఛ‌గా దాడులు.. కార‌ణం వాళ్లేనా?
X
చేయ‌ని త‌ప్పుకు బ‌లైపోతే ఎలా అనిపిస్తుంది? ఒకడు నేరం చేశాడ‌ని బంధువును ఉరితీస్తే ఎలా ఉంటుంది? ఒకడు అక్ర‌మం చేశాడ‌ని.. వాడి దేశానికి చెందిన వాళ్ల‌ను చంపేస్తే..? ఎలా అనిపిస్తుంది. చ‌దువుతుంటేనే మ‌న‌సులో ఏదోలా ఉందా? కానీ.. ఇప్పుడు దక్షిణాఫ్రికా దేశంలో ఇదే జ‌రుగుతోంది. ముగ్గురు భార‌తీయ సోద‌రులు.. ఇంకా చెప్పాలంటే ఒకే కుటుంబం చేసిన అవినీతి, అక్ర‌మం కార‌ణంగా.. ఆ దేశ‌మే చితికిపోయింది. ఆర్థికంగా నాశ‌న‌మైపోయింది. దీంతో.. ఆ కోపాన్ని సౌతాఫ్రికాలోని మిగిలిన భార‌తీయుల‌పై చూపిస్తున్నారు అక్క‌డి అల్ల‌రిమూక‌లు. భార‌తీయుల ఇళ్లు, వ్యాపారాలు ఏది క‌నిపిస్తే.. దాంట్లో ప‌డి దోచుకుపోతున్నారు. మిగిలిన ఇత‌ర దేశాల వారికి చెందిన‌ దుకాణాల‌ను సైతం కొల్ల‌గొడుతున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు 117 మంది ప్రాణాలు కోల్పోయారంటే.. ప‌రిస్థితి తీవ్ర‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ దారుణానికి కార‌కులు భార‌త‌దేశానికి చెందిన గుప్తా సోద‌రులు అన్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌. మ‌రి, వారు ఏం చేశారు? అస‌లు క‌థ ఏంటీ? అన్న‌ది చూద్దాం.

ఇండియాలోని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన‌ శివ‌కుమార్ గుప్తా ఒక‌ రేష‌న్ డీల‌ర్. ఆయ‌న‌కు ముగ్గురు సంతానం. ముగ్గురూ కొడుకులే. వారిపేర్లు అతుల్ గుప్తా, అజ‌య్ గుప్తా, రాజేశ్ గుప్తా. వీరిలో అతుల్ 30 సంవ‌త్స‌రాల క్రితం ద‌క్షిణాఫ్రికా వెళ్లి, చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు. అక్క‌డ వ్యాపారం మూడు పూలు ఆరు కాయ‌లుగా సాగ‌డంతో.. చెప్పుల‌ను వ‌దిలేసి కంప్యూట‌ర్ దుకాణం పెట్టుకున్నాడు. దీంతో.. సంపాద‌న భారీగా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే మండేలా పార్టీ ఆఫ్‌రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నేత‌ల‌తో వారికి ప‌రిచ‌యం మొద‌లైంది.

మండేలా పార్టీ అగ్ర నాయ‌కుడు థాబో ఎంబెకీ స‌హ‌చ‌రుడైన‌ ఎసోప్ ప‌హాద్ తో వీళ్ల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌య‌మే వీళ్ల‌ను ఊహించ‌ని స్థాయికి తీసుకెళ్లింది. న‌ల్ల‌జాతి సూరీడు నెల్స‌న్ మండేలా త‌ర్వాత స్థానంలో ఉన్న ఎంబెకీ సౌతాఫ్రికా అధ్య‌క్షుడు అయ్యారు. దీంతో.. ఆయ‌న స‌హ‌చ‌రుడైన‌ ప‌హాద్ ద్వారా.. గుప్తా బ్ర‌ద‌ర్స్ ఎంబెకీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఇంకేముందీ.. రాత మారిపోయింది. స‌ర్కారు కాంట్రాక్టులు, రాజ‌కీయ వాటాలు.. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వేలాది కోట్లు సంపాదించారు. అన్న‌ద‌మ్ములు ముగ్గురూ సౌతాఫ్రికా చేరిపోయారు. ఆ త‌ర్వాత యురేనియం గ‌నులు కాంట్రాక్టుల స్థాయికి ఎదిగేశారు. ఆ విధంగా.. అధ్య‌క్షుడికి మ‌రింత ద‌గ్గ‌ర అయ్యారు.

కాగా.. ఇక్క‌డే గుప్తా సోద‌రులు త‌మ‌దైన పాలిటిక్స్‌ చేశారు. అధ్య‌క్షుడితో ద‌గ్గ‌ర‌గా ఉంటూనే.. ప్ర‌తిప‌క్ష‌ పార్టీ అగ్ర‌నేత జుమాతోనూ రిలేష‌న్ కొన‌సాగించారు. ఎంబెకీ త‌ర్వాత జుమా సౌతాఫ్రికా అధ్య‌క్షుడు అయ్యారు. ఇక‌, అప్పుటి నుంచి వీరి హ‌వా ఎలా సాగిందో చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. గుప్తాలు చెప్పిన వారికే మంత్రి ప‌ద‌వులు వ‌చ్చే స్థాయికి చేరారు. ఆ విధంగా.. సౌతాఫ్రికా దేశ అధ్య‌క్ష భ‌వ‌న‌మే వీరి కంట్రోల్ లో ఉండేలా మారిపోయింది ప‌రిస్థితి. 2015వ సంవ‌త్స‌రంలో గుప్తా సోద‌రులు చెప్పిన వ్య‌క్తిని దేశ ఆర్థిక మంత్రిగా నియ‌మించారంటే వారి స్థాయిని అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే.. దేనికైనా తార‌స్థాయి ఉంటుంది. పెరుగుట విరుగుట కొర‌కే అన్న‌ట్టుగా.. ఆ తార‌స్థాయి త‌ర్వాత ప‌త‌నం మొద‌ల‌వుతుంది. వీరి అవినీతి కార‌ణంగా.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థే దివాళా తీసే స్థాయికి చేరింది. దీంతో.. గుప్తాల వ్య‌వ‌హారం దేశం మొత్తం తెలిసిపోయింది. ఎక్క‌డి నుంచో వ‌చ్చిన‌వాళ్లు త‌మ దేశాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని, వారితో క‌లిసి ప్ర‌భుత్వ నేత‌లు దేశాన్ని దివాళా తీయిస్తున్నార‌ని ప్ర‌జ‌ల్లో కోపం పెరిగిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే గుప్తా బ్ర‌ద‌ర్స్ ఓ పెళ్లి వేడుక నిర్వ‌హించారు. ప్ర‌పంచంలోనే ఘ‌న‌మైన వేడుక‌గా జ‌రిపారు. భార‌త్ నుంచి బంధువుల‌ను విమానాల్లో త‌ర‌లించారు. ఈ వేడుక మిల‌ట‌రీ ఆధీనంలో జ‌రిగింది. దీంతో.. విప‌క్షాలు, పౌర‌సంఘాలు, మీడియా గుప్తా బ్ర‌ద‌ర్స్ అక్ర‌మాల‌ను ఎత్తి చూప‌డం మొద‌లు పెట్టాయి. ఈ నిర‌స‌న విస్త‌రించ‌డంతో.. అధ్య‌క్షుడు జుమా 2018లో రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అయితే.. ఈ ప్ర‌మాదాన్ని ముందుగానే గుర్తించిన‌ గుప్తాలు.. అన్నీ స‌ర్దుకొని దుబాయ్ విమానం ఎక్కేశారు. విధిలేని ప‌రిస్థితుల్లో దేశాధ్య‌క్షుడు జుమా రాజీనామా చేశారు. నేరం నిరూప‌ణ కావ‌డంతో జుమా జైలు పాల‌య్యారు!

త‌మ దేశం ఈ పరిస్థితుల్లో ఉండ‌డానికి.. త‌మ దౌర్భాగ్యానికి విదేశీయులే కార‌ణ‌మ‌ని భావిస్తూ.. అక్క‌డి జ‌నం విదేశీయుల‌కు, ముఖ్యంగా భార‌తీయుల‌కు చెందిన ఇళ్లు, వ్యాపారాల‌పై దాడులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభ‌మైన అల్ల‌ర్ల‌తో దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది. ఇళ్ల‌లో, దుకాణాల్లో ప‌డి దొరికింద‌ల్లా దోచుకుపోతున్నారు. అనంత‌రం ఆ భ‌వ‌నాల‌ను నేల‌మ‌ట్టం చేస్తున్నారు. నిప్పు పెడుతున్నారు. ఈ దాడుల్లో భార‌త్ కు చెందిన వారే ఎక్కువ‌గా బాధితులుగా ఉన్నారు. మొత్తం 117 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8 వేల కోట్ల రూపాయ‌ల ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్టు అంచ‌నా. దీనిపై భార‌త ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌తీయుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వాన్ని కోరింది. ఆందోళ‌న‌కారులు మాత్రం.. భార‌తీయులంతా త‌మ దేశం వ‌దిలి వెళ్లిపోవాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదంతా గుప్తా సోద‌రుల అవినీతి కార‌ణంగానే జ‌రుగుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌నిషి ఆశకు అంతం అనేది ఉండ‌దు. అది దురాశ‌గా మారిపోయిన‌ప్పుడు.. జ‌రిగే అక్ర‌మానికి లెక్కాప‌త్రం ఉండ‌దు. ఈ అక్ర‌మాలు తార‌స్థాయికి చేరిన‌ప్పుడు జ‌రిగే దారుణాలు అత్యంత‌ ఊహాతీతంగా ఉంటాయి. దానికి నిద‌ర్శ‌నం సౌతాఫ్రికాలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లే సాక్ష్యం.