Begin typing your search above and press return to search.

హాట్ ఫెవరేట్.. వరుస ఓటములు.. ఏమైంది?

By:  Tupaki Desk   |   3 Jun 2019 5:02 AM GMT
హాట్ ఫెవరేట్.. వరుస ఓటములు.. ఏమైంది?
X
దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్ ముందటి వరకు భీకర జట్టు.. అందరూ మ్యాచ్ విన్నర్లే.. రబాడా - ఎంగిడి - డేల్ స్టెయిన్ లాంటి భీకర బౌలర్లున్నారు.. డుప్లెసిస్ - ఆమ్లా - మిల్లర్ - డికాక్ - డుమిని లాంటి మ్యాచ్ విన్నర్లున్నారు.. ఆస్ట్రేలియా బలంగా ఉన్నప్పుడు రికీ పాంటింగ్ హయాంలో ఆ జట్టును ఓడించిన ఏకైక జట్టు దక్షిణాఫ్రికానే.. కానీ ప్రపంచకప్ లాంటి మహాసంగ్రామంలోకి వచ్చేసరికి మాత్రం ఈ సింహాల జట్టు.. పిల్లి కూనలుగా మారిపోతుంటుంది. ఎందుకిలా అంటే ఎవ్వరికీ అర్థం కానీ పరిస్థితి. ఒత్తిడిని ఎదుర్కోలేని వారి నిస్సహాయతనా? ప్రపంచకప్ ఫోబియానా? లేక ఇలాంటి పెద్ద ఈవెంట్లలో రాణించలేని ట్రాక్ రికార్డా? తెలియదా కానీ.. అత్యంత భీకర టీమ్.. చేతులు ఎత్తేస్తుండడం ప్రపంచ క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది.

లీగ్ దశలో అత్యంత భీకరంగా ఆడి చెలరేగి కీలక సెమీస్ లలో ఓడిపోతుంటుంది దక్షిణాఫ్రికా టీం. ఆ జట్టుకు నాలుగు దశాబ్ధాలుగా ప్రపంచకప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. హన్సీ క్రోనే సారథ్యంలో ప్రపంచ మేటి క్రికెట్ జట్లను ఓడించిన ఘనత సౌతాఫ్రికాది.. అనేక సార్లు దగ్గరదాకా వచ్చి ఓడిపోయింది.

ఈ సారి కూడా ప్రపంచకప్ ముందర దక్షిణాఫ్రికా బీకర జట్టే.. కానీ రంగంలోకి దిగాక మాత్రం తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓడిపోగా.. నిన్న రాత్రి పసికూడా బంగ్లా చేతిలో దెబ్బైపోయింది. టోర్నమెంట్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన సౌతాఫ్రికా ఇంత పేలవంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ప్రతీ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా ఆడితే తప్ప ఆ జట్టు ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది. తీవ్ర ఒత్తిడే ఈ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను - టీంను చిత్తు చేస్తోందని అంటున్నారు.

వీరి దురదృష్టం మామూలుగా లేదు.. ఒక టీంగా వీరు రాణించలేకపోవడమే బలహీనతగా మారింది. ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న ఆ టీం కల ఈ ప్రపంచకప్ లోనూ నెరవేరేలా కనిపించడం లేదు. ఎప్పుడూ సెమీస్ దాకా వచ్చి ఓడే ఈ టీం ఇప్పుడు తొలి రెండు మ్యాచ్ లలోనే ఓడడం నిరాశ కలిగించింది. ఇప్పుడు సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచ్ ను 5న ఇండియాతో ఆడాల్సి ఉంది. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ఇండియన్లను తట్టుకోవడం సౌతాఫ్రికాకు కష్టమే.. మరి వరుస ఓటముల సౌతాఫ్రికా.. ఇండియాను ఎలా నిలువరిస్తుందనేది వేచిచూడాలి..