Begin typing your search above and press return to search.

9 రోజులు ఓపిక పడితే బెజవాడ స్టేషన్ కింగే..

By:  Tupaki Desk   |   20 Sep 2016 7:30 AM GMT
9 రోజులు ఓపిక పడితే బెజవాడ స్టేషన్ కింగే..
X
దేశంలోని బిజీ రైల్వే జంక్షన్లలో ఒకటిగా.. దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్ద జంక్షన్ గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌ ఎన్నడూ లేనట్లుగా బోసిపోయింది. ఒక్క రోజే కాదు 9 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో నవ్యాంధ్ర రాజధానిగా ఉన్న నగరం ఇప్పుడు బోసిపోయినట్లుగా ఉంది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో జరుగనున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ - ప్లాట్‌ ఫారాల ఆధునీకరణ పనుల వల్ల మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు రైళ్ల రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. దాదాపు రెండు వేలమంది కార్మికులు ఈ ఆధునీకరణ పనుల్లో పాల్గొంటున్నారు.

ఈ తొమ్మిది రోజులు వేలాది మంది రైలు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని తేలిపోయింది. విజయవాడ డివిజన్ నుంచి ఏటా 4వేల కోట్ల ఆదాయం దక్షిణ మధ్య రైల్వేకు సమకూరుతోంది. రోజుకు సుమారు 300లకు పైగా రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వేస్టేషన్‌ లో 50 రైళ్లను పూర్తిగా - మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేశారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. విజయవాడ స్టేషన్‌ లో 10 ప్లాట్‌ ఫారాలు ఉన్నా - 8 - 9 - 10 ప్లాట్‌ ఫారాల పైకి ఒకవైపు నుంచి మాత్రమే రైళ్లు వచ్చిపోతుండేవి. 2 నుంచి 5 ప్లాట్‌ ఫారాల వరకు 24 బోగీలున్న ఎక్స్‌ ప్రెస్‌ లు ఏవీ వచ్చేవికావు. ఫ్లాట్ ఫాంలు ఉన్నా తగిన సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం. ఈ ఒక్క సమస్యతోనే విజయవాడ జంక్షన్‌ లో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్. అయితే త్వరలోనే ఈ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. ఇక అవుటర్‌లో పడిగాపులు ఉండబోవు. ప్లాట్‌ ఫారాల మధ్య తేడాలుండవు. ఒక్క 9 రోజులు ఓపిక పడితే చాలు.. పనులన్నీ పూర్తయితే ఏపీలో రైల్వే కష్టాలు తీరిపోతాయి.

ప్రస్తుతం విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల కోసం రెండు ట్రాక్ లు ఉన్నప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థను ఆపివేయడంతో, ఏ రైలూ స్టేషన్ లో ఆగకుండానే సాగుతుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లను సీతానగరంలో - హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను కొండపల్లి - విశాఖ నుంచి వచ్చే రైళ్లను గుణదల స్టేషన్లలో నిలిపి - అక్కడే ప్రయాణికులను దించి - ఔటర్ లైన్ మీదుగా నగరాన్ని దాటిస్తున్నారు. దీంతో ఈ రైల్వే స్టేషన్లలో సందడి నెలకొని.. విజయవాడ వెలవెలబోతోంది.