Begin typing your search above and press return to search.

కొరియాపై ట్రంప్ యుద్ధం..బ్లాకౌట్ బాంబ్ సిద్ధం

By:  Tupaki Desk   |   9 Oct 2017 12:46 PM GMT
కొరియాపై ట్రంప్ యుద్ధం..బ్లాకౌట్ బాంబ్ సిద్ధం
X
ఉత్త‌ర‌కొరియా-అమెరికాల మ‌ధ్య క‌మ్ముకున్న యుద్ధ‌మేఘాలు తారాస్థాయికి చేరాయి. ఉత్తరకొరియాను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఉత్తర కొరియాతో చర్చలకు ట్రంప్‌ విముఖంగా ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఆయన అమెరికా సెక్రటరీ రెక్స్‌ టిల్లర్సన్‌ ను ఉద్దేశించి కూడా ఓ ట్వీట్‌ చేశారు. ``మనం ఏం చేయాలో అదే చేద్దాం.. శక్తిని దాచుకో రెక్స్‌``అని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా యుద్ధం తప్పదని ప‌రోక్షంగా తేల్చిచెప్పారు. తన ట్విట్ట‌ర్ అకౌంట్లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ``ఎంతో మంది అధ్యక్షులు - వారి కార్యదర్శులు 25ఏళ్లుగా ఉత్తరకొరియాతో ఎడతెగని చర్చలు జరిపారు. భారీగా ఆ దేశానికి సొమ్ములు ముట్టజెప్పారు. కానీ అవేవీ పనిచేయలేదు. చేసుకున్న ఒప్పందాలను ఉల్లఘించింది. అమెరికా మధ్యవర్తులు ఫూల్స్‌ అయ్యారు. ఇప్పుడు కలంలో సిరా అయిపోయింది. క్షమించండి - కేవలం ఒకే ఒక మందు దీనికి బాగా పనిచేస్తుంది..!` అని ట్వీట్‌ చేశారు.

మ‌రోవైపు అమెరికాతో స‌త్సంబంధాలు నెరుపుతున్న దక్షిణ కొరియా...త‌న పొరుగున ఉన్న ఉ.కొరియాను లక్ష్యంగా చేసుకొని ఓ ఆయుధాన్ని సిద్ధం చేసింది. `బ్లాకౌట్‌ బాంబ్‌`గా వ్యవహరించే ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే విద్యుత్తు వ్యవస్థ దాదాపు కుప్పకూలుతుంది. దీంతో విద్యుత్తు - బ్యాటరీ - జనరేటర్‌ వంటి వ్యవస్థల ఆధారంగా పనిచేసే ఆయుధాలను శత్రుదేశలు ప్రయోగించడం సాధ్యం కాదు. ఈ ఆయుధాన్ని 'సాఫ్ట్‌ బాంబ్‌'గా కూడా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా స్థానిక మీడియా సంస్థ ఒకటి బహిర్గతం చేసింది. రసాయన మార్పులు చేసిన అత్యంత పలుచని గ్రాఫైట్‌ ఫిలమెంట్స్‌ ను బ్లాకౌట్‌ బాంబ్‌ కోసం వినియోగిస్తారు. ఇవి గాలిలో దూదిపింజల మాదిరిగా తేలుతాయి. వీటిని శత్రుదేశాల విద్యుత్తు వ్యవస్థలు విస్తరించిన ప్రాంతాల్లో వదులుతారు. ఈ గ్రాఫైట్‌ ఫిలమెంట్స్‌ గాలిలో మేఘాల్లా తేలుతూ వెళ్లి విద్యుత్తు పరికరాలపైకి చేరతాయి. వీటి కారణంగా షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి విద్యుత్తు వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది.

గ‌తంలో బ్లాకౌట్ బాంబ్‌ ను గ‌తంలో ఇరాక్‌ - సెర్బియాలపై ప్రయోగించారు. గల్ఫ్‌ యుద్ధ సమయంలో 85శాతం ఇరాక్‌ విద్యుత్తు వ్యవస్థను ఈ విధంగానే స్తంభింపజేశారు. నాటో కూటమి సెర్బియాపై కూడా ప్రయోగిం చింది. దీని ఫలితంగా సెర్బియా పవర్‌ గ్రిడ్‌ 70శాతం కుప్పకూలింది. 2007లో బాగ్దాద్‌ లోని అల్‌ ఖైదా అవుట్‌ పోస్టుపై దీనిని ప్రయోగించారు. అప్పుడు అల్ ఖైదా తీవ్రంగా నష్టపోయింది.