Begin typing your search above and press return to search.

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి వైఫ్ కు అయోధ్య‌కు లింకేంటి?

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:44 AM GMT
ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి వైఫ్ కు అయోధ్య‌కు లింకేంటి?
X
అయోధ్య అన్నంత‌నే శ్రీ‌రామ‌చంద్రుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఇక్క‌డున్న వివాదాస్ప‌ద మందిరం కార‌ణంగా ఎంత ర‌చ్చ జ‌రిగింది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయోధ్య అన్నంత‌నే శ్రీ‌రాముడు గుర్తుకొస్తే అంశం ఒకటైతే.. అక్క‌డెక్క‌డో సౌత్ కొరియా అధ్య‌క్షుడి స‌తీమ‌ణి ఎందుకు ప‌ర్య‌టిస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ మాట‌కు సౌత్ కొరియాకు.. అయోధ్య‌కు మ‌ధ్య‌నున్న లింకు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. చరిత్ర‌పుట‌ల్లో ఉండిపోయిన విష‌యాన్ని తెర మీద‌కు తేవ‌ట‌మే కాదు.. రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత పెరగ‌టానికి అయోధ్య కార‌ణంగా మారుతోంది. ఎందుకిలా? సౌత్ కొరియాకు.. అయోధ్య‌కు మ‌ధ్య‌నున్న లింకులోకి వెళితే.. అప్పుడెప్పుడో కీస్తు శ‌కం 48లో (సుమారు 1970 సంవ‌త్స‌రాల క్రితమ‌న్న మాట‌) అయోధ్య యువ‌రాణి సూరిర‌త్న కొరియాకు వెళ్లారు. అక్క‌డి యువ‌రాజును పెళ్లి చేసుకున్న‌ట్లుగా అయోధ్య ప్ర‌జ‌లు న‌మ్ముతారు. కొరియా యువ‌రాజుతో పెళ్లి అనంత‌రం సూరిర‌త్న పేరును హియో హ్వాంగ్‌-ఓక్ గా మార్చారు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ప్ర‌స్తుతం అయోధ్య‌లో ఉన్న యువ‌రాణి స్మార‌కానికి అదే పేరు ఉండ‌టం. యూపీ సీఎంగా ఆదిత్య నాథ్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత సూరిర‌త్న స్మార‌కాన్ని సుంద‌రీకర‌ణ చేసే ప‌ని షురూ చేశారు. ఇందులో భాగంగా భూమిపూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి స‌తీమ‌ణి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంతో పాటు అయోధ్య‌లో జ‌రిగే దీపావ‌ళి వేడుక‌ల కోసం ఆమె అయోధ్య‌కు వ‌చ్చారు.