Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్.. ఆ రెండు పార్టీలూ షాక్ లో ఉండిపోయాయా!

By:  Tupaki Desk   |   20 May 2019 1:24 PM GMT
ఎగ్జిట్ పోల్స్.. ఆ రెండు పార్టీలూ షాక్ లో ఉండిపోయాయా!
X
ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాకా వివిధ పార్టీల నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయేకే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతూ ఉన్న నేపథ్యంలో కొందరు వాటికి అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతలను, ఆ పార్టీ అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఉన్నాయని చెప్పక తప్పదు. ఆ పార్టీ నేతలు సంబరంగా ఉన్నారు. మరోసారి తమకే అవకాశం రావడం ఖాయమని వారు ఇప్పుడు మరింత విశ్వాసంతో చెబుతూ ఉన్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ తమకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో మమతా బెనర్జీ - చంద్రబాబు నాయుడు లాంటి వారు అవి నిజం కాదు అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మేది లేదని వీరిద్దరూ ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా అబద్ధమని, ఆ విషయం అసలు ఫలితాల రోజున తేలుతుందని ప్రకటించారు. అసలు ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయని కాంగ్రెస్ అంటోంది.

ఇలా వివిధ పార్టీలు ఎగ్జిట్ పోల్స్ విషయంలో స్పందిస్తూ ఉన్నాయి. ఎటొచ్చీ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాకా షాక్ లో ఉన్న పార్టీలో ఎస్పీ - బీఎస్పీ. దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలూ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయంలో స్పందించడం లేదు. ఒకరకంగా ఈ రెండు పార్టీలకూ ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇచ్చాయి!

యూపీలో ప్రబల ప్రాంతీయ శక్తులు అయిన ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసి కూడా సాధించేది ఇరవై లోపు ఎంపీ సీట్లే అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎస్పీ - బీఎస్పీలు కలిసి కూడా బీజేపీని యూపీలో ఆపలేవని.. యూపీలో కమలం పార్టీ అరవై వరకూ ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని కొన్ని చానళ్ల పోస్ట్ పోల్ సర్వేలు పేర్కొన్నాయి. దీంతో మహాఘట్ బంధన్ పార్టీలకు గట్టి ఝలక్ తగిలింది. ఏం రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ పార్టీల అధినేతలు మీడియా ముందుకు కూడా రాకపోవడం గమనార్హం.