Begin typing your search above and press return to search.
యూపీలో మాకు సగం సీట్లు పోతాయ్: కేంద్రమంత్రి
By: Tupaki Desk | 31 March 2018 9:52 AM GMTఎన్డీయే భాగస్వామి - ఆర్పీఐ అధ్యక్షుడు - కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఆయన చేసిన పలు వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, బీజేపీపై అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు తగ్గే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 73 సీట్లు వచ్చాయని - 2019 ఎన్నికల్లో 50 సీట్లు వస్తాయని అన్నారు. అయితే, దాని వల్ల ఇబ్బందేమీ లేదని - 2019లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్నారు. అంతేకాకుండా, ప్రధాని మోదీని కాంగ్రెస్ - ఎస్పీ - బీఎస్పీ - రాహుల్ గాంధీ ఎదుర్కొనలేరని చెప్పారు. యూపీలో అత్యంత వెనుకబడిన వర్గాలకు - మహాదళితులకు రిజర్వేషన్ల కల్పనపై అధ్యయనం చేయిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారమే బీఆర్ అంబేడ్కర్ పేరులో రాంజీని చేర్చారని - యోగి ఆదిత్యనాధ్ ను ప్రశంసించారు.
కాగా, గతంలో అథవాలే చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం - గవర్నమెంట్ ఉద్యోగం కల్పించేలా రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని అథవాలే గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ కూడా రాశారు. భారత క్రికెట్ జట్టులో రిజర్వేషన్ల ప్రకారం ఆటగాళ్లను ఎంపిక చేయాలంటూ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చి సంచలనం రేపారు. తాజాగా - వందేమాతర గీతాన్ని అందరూ పాడాల్సిందేనని, ఒక వేళ ఎవరన్నా పాడక పోయినా అందులో తప్పేమీ లేదని అథవాలే వ్యాఖ్యానించారు. ఆడ - మగ కాని ట్రాన్స్ జెండర్లు చీర కట్టుకోకూడదని హైదరాబాద్ పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, అది తన అభిప్రాయం మాత్రమేనని అథవాలే - కొంతమంది హిజ్రాలు ప్యాంటు చొక్కా ధరిస్తున్నారని - ఒక వేళ హిజ్రాలు చీరలు కట్టుకుంటామన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.