Begin typing your search above and press return to search.

అలాంటి ప్ర‌చారం చేస్తే జైలుకే!

By:  Tupaki Desk   |   6 Oct 2017 5:45 AM GMT
అలాంటి ప్ర‌చారం చేస్తే జైలుకే!
X
ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీల ముచ్చ‌ట్లు అంటే ఆస‌క్తి ఎవ‌రికి ఉండ‌దు. వారి వ్య‌క్తిగ‌త విష‌యాలంటే ప‌నులు మానేసుకొని మ‌రీ స‌మ‌యం కేటాయించే వారు చాలా మందే. ఆ బ‌ల‌హీన‌త‌ను సొమ్ము చేసుకునేందుకు ఇంట‌ర్నెట్‌ను వేదిక‌గా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధ‌మైంది.

అశ్లీలంగా.. అభ్యంత‌ర‌క‌రంగా ఫోటోల్ని వాడేస్తూ.. త‌ప్పుడు అర్థాలు వ‌చ్చేలా.. వారి ప‌రువుకు భంగం వాటిల్లేలా సాగుతున్న ప్ర‌చారంపై సైబ‌ర్ క్రైం పోలీసులు యుద్ధం ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కాలంలో యూట్యూబ్‌.. ఇత‌ర వెబ్ సైట్లు త‌మ రేటింగ్ లు పెంచుకోవ‌టానికి.. వీక్ష‌కుల సంఖ్య‌ను రెట్టింపు చేసుకోవ‌టానికి సంబంధం లేని హెడ్డింగ్‌ లు పెట్టి.. త‌మ వార్తాక‌థ‌నాల్ని చ‌దివించే ప్ర‌య‌త్నం చేయ‌టం తెలిసిందే. గాసిప్స్ పేరిట హ‌ద్దులు దాటేస్తున్న ప్ర‌చారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన సైబ‌ర్ పోలీసులు.. మా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేశారు.

మా ప్ర‌తినిధులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని యూట్యుబ్‌.. వెబ్ సైట్ల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు. చ‌ట్ట‌విరుద్ధంగా సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లోకి త‌ల‌దూర్చేలా పోస్టింగ్ లు ఏమేమి ఉన్నాయి? వాటికి బాధ్యులు ఎవ‌రు? అన్న అంశాల్ని లెక్క తేల్చే ప‌నిలో ప‌డ్డారు. ఎవ‌రి ప‌రువుకైనా భంగం క‌లిగించే రీతిలో పోస్టింగ్‌ లు పెడితే ఉపేక్షించేది లేద‌ని.. జైలుపాలు కాక త‌ప్ప‌ద‌ని సీఐడీ సైబ‌ర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహ‌నరావు వార్నింగ్ ఇస్తున్నారు.

ఇత‌రుల‌పై అశ్లీలంగా.. అస‌భ్యంగా.. వారి ప‌రువుకు భంగం వాటిల్లేలా ప్ర‌చారం చేసిన నేరానికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ‌ర‌కూ జైలుశిక్ష‌లు ఉంటాయ‌న్నారు. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. అలాంటి విష‌యాలు క‌ల్పిత‌మైనా.. వాస్త‌వ‌మైన‌ప్ప‌టికీ ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించేలా ఉంటే నేరం కింద ప‌రిగ‌ణిస్తామ‌ని తేల్చి చెప్పారు.

త‌మ దృష్టికి వ‌చ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని చూసిన‌ప్పుడు కొన్ని వెబ్ సైట్లు విదేశాల నుంచి నిర్వ‌హిస్తున్న‌ట్లుగా గుర్తించామ‌న్నారు. ఈ సంద‌ర్భాల్లో ఇంట‌ర్ పోల్ స‌హ‌కారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌ముఖుల‌కు సంబంధించి అశ్లీలంగా.. అస‌భ్యంగా పోస్టులు పెట్టే వెబ్ సైట్లు వంద‌లాదిగా ఉన్న‌ప్ప‌టికీ.. ముఖ్యంగా పాతిక వెబ్ సైట్ల నిర్వాహ‌కుల‌పై మొద‌ట చ‌ర్య‌లు తీసుకునేందుకు సైబ‌ర్ సెల్ అధికారులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

స్థానికంగా ఉండే వెబ్ సైట్ నిర్వాహ‌కుల‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే నేరుగా అరెస్ట్ చేస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాలు.. విదేశాల్లో ఉండే వారికి మాత్రం నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. విష‌యం ఏమీ లేకున్నా చౌక‌బారుగా వ్య‌వ‌హ‌రించే వారికి తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే చెప్పాలి.