Begin typing your search above and press return to search.

క‌థువా కేసు విచార‌ణ‌లో అనుభ‌వాల్ని చెప్పుకొచ్చారు!

By:  Tupaki Desk   |   11 Jun 2019 4:25 AM GMT
క‌థువా కేసు విచార‌ణ‌లో అనుభ‌వాల్ని చెప్పుకొచ్చారు!
X
అభం శుభం ఎరుగ‌ని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒళ్లుగ‌గుర్పాటుకు గురి చేసేలా అత్యాచారం చేసి.. హ‌త‌మార్చిన న‌ర‌రూప రాక్ష‌సుల‌కు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కోర్టు వారికి విధించిన శిక్ష (ముగ్గురికి జీవిత ఖైదు.. మిగిలిన మ‌రో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున కారాగార శిక్ష‌) నేప‌థ్యంలో కేసును విచారించిన సీనియ‌ర్ ఎస్పీ ర‌మేశ్ కుమార్ స్పందించారు. దుర్మార్గానికి పాల్ప‌డిన దోషుల‌కు స‌రైన శిక్ష ప‌డింద‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా తీర్పు వెలువ‌డిన వేళ‌.. కేసుకు సంబంధించి విచార‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న అంశాల గురించి ఆయ‌న మాట్లాడారు. రిటైర్ అయిన తాను అబ‌ద్ధాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌న పేరు చెడిపోయే అవ‌కాశం లేద‌ని.. కేసు విచార‌ణ‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కోర్టుకు ఆధారాలు స‌మ‌ర్పించినట్లుగా పేర్కొన్నారు.

విచార‌ణ సాఫీగా సాగినా.. కొంద‌రు ఈ అంశానికి మ‌తం రంగు పులిమే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. కిరాత‌కుల చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన చిన్నారి ఆత్మ‌కు న్యాయం జ‌రిగింద‌న్నారు. క‌ల‌లో కూడా ఊహించ‌ని రీతిలో చిన్నారిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసిన వారికి శిక్ష ప‌డ‌టంతో పై నుంచి చిన్నారి చూసి సంతోషించి ఉంటుంద‌న్నారు. లైంగిక దాడి చేసి హ‌త్య చేసిన సాంజీరాం.. అత‌ని అనుచ‌రులేం చేశారో చెప్పారు.

విచార‌ణ‌లో భాగంగా దోషులు తాము త‌ప్పించుకునేందుకు ఆడిన నాట‌కాల్ని ఆయ‌న వివ‌రించారు. విచార‌ణ ప‌క్క‌దారి ప‌ట్టేలా ప్ర‌య‌త్నించినా.. వారి పప్పులు ఉడ‌క్కుండా తాము జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్నారు. కేసు విచార‌ణ సంద‌ర్భంగా త‌న‌కు ఎలాంటి రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిళ్లు రాలేద‌న్నారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీర్ లో పీడీపీ.. బీజేపీ భాగ‌స్వామ్యంలోని ప్ర‌భుత్వం ప‌వ‌ర్లో ఉంద‌న్నారు. విచార‌ణ సంద‌ర్భంగా ఏ రాజ‌కీయ నేత నుంచి త‌న‌కు ఒత్తిడి రాలేదన్న ఆయ‌న‌.. నాటి అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు ఎవ‌రూ కేసు విష‌యాల్లో క‌లుగ‌జేసుకోలేద‌న్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కోర్టుకు ఆధారాల్ని స‌మ‌ర్పించామ‌న్నారు.

రాజ‌కీయ నాయ‌కుల నుంచి తాము ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోలేద‌న్న విచార‌ణ అధికారి.. మీడియా నుంచి మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. కొన్నిసార్లు భిన్న‌మైన అంశాల్ని చూపించార‌న్నారు. అందుకే ఏది నిజ‌మో? ఏది అబ‌ద్ధ‌మో నిర్దారించేందుకు త‌మ‌కు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. మంత్రులు.. మీడియాతో స‌హా ఎవ‌రికి తాము విచార‌ణ కాపీని ఇవ్వ‌లేద‌ని.. కోర్టుకే మొద‌ట ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. అయితే.. కొంద‌రురౌడీల‌తో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది ప‌డిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.