Begin typing your search above and press return to search.

ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు కాగితాలకే భాగ్యనగర వాసులకి ఆ కష్టాలు అందుకే !

By:  Tupaki Desk   |   13 March 2021 12:32 PM GMT
ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు కాగితాలకే భాగ్యనగర వాసులకి ఆ కష్టాలు అందుకే !
X
హైదరాబాద్ లో ఐటీ జోన్ మొత్తం భారీ భవనాలతో నిండిపోయింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూతద్దం వేసి వెతికినా ఒక్క ఇంచు జాగా దొరకడం కష్టమే. బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణానికి సంబంధించి ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్ ‌ఎస్ ‌ఐ) నిబంధన నగరంలో కాగితాలకే పరిమితం అవుతుంది. ఒక ఎకరం స్థలంలో నిర్మించే వాణిజ్య భవనం కేవలం 2.5 లక్షల చదరపు అడుగులకు మించరాదన్నదే ఈ ఎఫ్ ‌ఎస్ ‌ఐ నిబంధన. కానీ ఐటీ జోన్, ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో ఎకరం జాగాలో సుమారు 10–15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవంతులే ఎక్కువ. తాజాగా కుష్మన్‌ వేక్‌ ఫీల్డ్‌ అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది.

ఫ్లోర్ ‌స్పేస్‌ అధికమైతే సంభవించే కష్టాలు ఏవంటే ... భారీ విస్తీర్ణంలో నిర్మించిన బహుళ వాణిజ్య భవంతుల్లో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి రావడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు వేలాదిగా ప్రధాన రహదారులను ముంచెత్తుతుండడంతో గ్రిడ్‌ లాక్‌ అయి ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. వర్షాకాలంలో వర్షపునీరు ఇంకే దారులు లేక వరదనీరు ప్రధాన రహదారులపైకి పోటెత్తుతోంది. వర్షపునీరు ఇంకేందుకు ఖాళీ ప్రదేశాలు లేకపోవడంతో భూగర్భజలమట్టాలు పడిపోతున్నాయి.

భారీ భవనాల చుట్టూ గ్రీన్ ‌బెల్ట్‌ అవసరమైనంత మేర లేకపోవడం, వాహనాలు వదిలే పొగ, దుమ్ము, ధూళి కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గి సిటీజనులు అనారోగ్యం పాలవుతున్నారు. భూతాపం వాతావరణంలో కలిసే పరిస్థితి లేక అధిక వేడిమితో జనం విలవిల్లాడుతున్నారు.

మనదేశంలోని ఇతర మెట్రో నగరాలకు , హైదరాబాద్ కి ఉన్న తేడా ఏమిటి అంటే..దేశరాజధాని ఢిల్లీలో ఎకరం స్థలంలో కేవలం 1.23 లక్షల చదరపు అడుగుల భవనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతకుమించి చేస్తే కఠిన శిక్షలే. వాణిజ్య రాజధాని ముంబాయి సిటీలో 2.55 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. బెంగళూరులో కేవలం 2.5 లక్షల చదరపు అడుగులు మాత్రమే.

చెన్నై సిటీలో 3.25 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. పూణేలో కేవలం 2 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్లు ఇస్తున్నారు. అయితే , హైదరాబాద్ లో మాత్రం ఆ నిబంధనలు ఏమి ఉండవు. ప్రభుత్వం ఫ్లోర్ ‌స్పేస్‌ ఇండెక్స్‌ నిబంధనల కఠినంగా అమలు చేయడంలేదు. దీంతో ఒక ఎకరా స్థలంలో ఏకంగా 10–15 లక్షల చదరపు అడుగుల భారీ భవనాలు కడుతున్నారని తాజా అధ్యయనంలో తేటతెల్లం అయ్యింది.