Begin typing your search above and press return to search.

ఆ తెలుగోడు అంతర్జాతీయ పౌరుడట

By:  Tupaki Desk   |   29 July 2016 2:35 PM GMT
ఆ తెలుగోడు అంతర్జాతీయ పౌరుడట
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ శుక్రవారం కూడా జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా మధ్య మధ్యలో జైట్లీ వ్యాఖ్యల్ని ఏపీ తెలుగుదేశం నేతలు మొదలుకొని.. కాంగ్రెస్ సహా పలు పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కాస్తంత ఉల్లాసంగా కనిపించారు.

నిత్యం చిర్రుబుర్రులాడుతున్నట్లుగా కనిపించే కురియన్.. ఈ రోజు అందుకు భిన్నంగా కాస్త సరదాగా కనిపించారు. సభ్యుల్ని అదిలిస్తూ.. అంతలోనే బుజ్జగిస్తూ.. వారిని తాను కోరుకున్నట్లుగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. తాను మద్రాస్ లో పుట్టానని.. ఆంధ్రాలో పెరిగానని.. తెలంగాణతో అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. తనకు తెలుగు రాష్ట్రాల విషయంలో అవగాహన ఉందని.. తన సూచనల్ని పట్టించుకోవాలన్నారు.

దీనికి రియాక్ట్ అయిన కురియన్.. ఏచూరిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మీరు జాతీయ.. అంతర్జాతీయ పౌరులు. మీరు ఏ విషయం మీదనైనా మాట్లాడొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘మీకు రాష్ట్రాల పరిమితులు లేవు. ఏ రాష్ట్రం.. ఏ అంశం మీదనైనా మాట్లాడొచ్చు’’ అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలకు సభలో సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు.