Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లోనూ త‌ప్ప‌ని స్పీక‌ర్ సెంటిమెంట్‌!

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:09 AM GMT
తెలంగాణ‌లోనూ త‌ప్ప‌ని స్పీక‌ర్ సెంటిమెంట్‌!
X
ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. కొన్ని సెంటిమెంట్లు విన్న‌ప్పుడు నిజ‌మే క‌దా? అనుకోకుండా ఉండ‌లేం. తాజాగా వెలువ‌డిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని ప‌రిశీలించిన‌ప్పుడు ఈ త‌ర‌హాలోనే ఒక సెంటిమెంట్ గుర్తుకు రాక మాన‌దు. ఉమ్మ‌డి రాష్ట్రంలో స్పీక‌ర్ గా ప‌ని చేసిన వారు.. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌టం జ‌రుగుతుంటుంది.

ఈ సెంటిమెంట్ కార‌ణంగా కొంద‌రైతే.. స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌న్న వెంట‌నే..వ‌ద్దు బాబోయ్.. వ‌ద్దు అని చెబుతుంటారంటారు. ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌తి ట‌ర్మ్‌ లోనూ క‌నిపించే ఈ సెంటిమెంట్ య‌థాత‌ధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ క‌నిపించింది. తెలంగాణ‌లో సునామీ త‌ర‌హాలో గులాబీ ప్ర‌భంజ‌నం చోటు చేసుకున్నా.. స్పీక‌ర్ సెంటిమెంట్ ను మాత్రం అధిగ‌మించ‌లేక‌పోయార‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో తొలి స్పీక‌ర్ గా రికార్డుల్లోకి ఎక్కిన మ‌ధుసూద‌నాచారి ఈసారి ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ప‌నులు ప‌త్రిక‌ల్లో ప‌తాక స్థాయిలో క‌నిపించాయి. ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు ఒక‌రి అంతిమ యాత్ర సాగుతుంటే.. తానే స్వ‌యంగా క‌ట్టె మోయ‌టం.. మొద‌లు ఆయ‌న చేయ‌ని ప‌నంటూ లేదు. స్పీక‌ర్ హోదాతో వ‌చ్చే అడంబ‌రాన్ని ప‌క్క‌న పెట్టేసి.. సామాన్య నేత‌లా గెలుపు కోసం ఆయ‌న విప‌రీతంగా శ్ర‌మించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఫ‌లితం ద‌క్క‌లేదు.

విప‌రీత‌మైన ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉన్న నేత‌లు ప‌లువురు విజ‌యం సాధించ‌గా.. మ‌ధుసూద‌నాచారి ఓట‌మిపాలు కావ‌టాన్ని ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తాజా ఓట‌మి.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న అసంతృప్తి కంటే కూడా స్పీక‌ర్ సెంటిమెంట్ ఎక్కువ‌గా వ‌ర్క్ వుట్ అయ్యింద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న స్పీక‌ర్ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలోనూ కంటిన్యూ అయ్యింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.