Begin typing your search above and press return to search.

అభిషేకం పాలల్లో కాసింత చక్కెర కలిపితే సరి!

By:  Tupaki Desk   |   1 April 2018 7:48 AM GMT
అభిషేకం పాలల్లో కాసింత చక్కెర కలిపితే సరి!
X
‘‘వెర్రి ముదిరితే.. రోకలి తలకు చుట్టమన్నాడని’’ సామెత. అంతే మరి పైత్యం ప్రకోపించిన తరువాత.. తార్కికజ్ఞానం ఎందుకుంటుంది. నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో, వారి భజన చేయడంలో, వారిని సత్కరించి.. తమ పబ్బం గడుపుకోవడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఆలోచించి.. తద్వారా కొత్త ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని పార్టీల కార్యకర్తలు, అనుచరులు ఉవ్విళ్లూరుతూ ఉండడం సహజం. కానీ రాజకీయ కార్యకర్తల్లో వేలంవెర్రిగా ప్రకోపించే ఈ పైత్యం ముదిరితేనే.. నాయకులకు కొంత కష్టంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితే తెలంగాణ శాసనసభ స్పీకరు మధుసూదనాచారికి ఎదురైంది.

తెలంగాణలో గిరిజన తాండాలను పంచాయతీలుగా మార్చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా.. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఆరు తాండాలు పంచాయతీలుగా రూపుదాల్చాయి. ఇది గులాబీ కార్యకర్తలకు మహదానందాన్ని కలిగించింది. వారు తమ ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞతను చాటుకోవాలని అనుకున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలోనే ఎవ్వరూ ఎన్నడూ చేసి ఉండని రీతిలో ఆయనను సత్కరించాలని కూడా అనుకున్నారు.

స్పీకరుగా ఉన్న తమ ఎమ్మెల్యే మధుసూదనాచారిని పిలిచి.. శాలువా కప్పి సత్కరించి.. ఏకంగా పాలాభిషేకానికి పూనుకున్నారు. ఆరు తాండాలు పంచాయతీలుగా మారాయి గానుక.. ఆరు కుండలతో శ్రేష్టమైన పాలు తెప్పించి.. ఆయన నెత్తిన గుమ్మరించి అభిషేకించారు. కార్యకర్తలు అభిమానం చాటుకోవడానికి పాలాభిషేకాలు చేయడం మనకు కొత్త కాదు. కాకపోతే..ఏదో విగ్రహాలకో - ఫ్లెక్సిలకో ఇలాంటి అభిషేకాలు చేస్తుంటారే తప్ప.. ఏకంగా మనిషినే కూర్చోబెట్టి.. పాలను గుమ్మరించడం ఇదే ప్రధమం అని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారుట.

అయినా ఆరు కుండల పాలను గుమ్మరించుకున్న తరువాత.. పాపం.. పాలతో తడిచిపోయిన స్పీకరు మధుసూదనాచారి.. ఫ్రెష్ గా నీటితో స్నానంచేసి మళ్లీ తయారై.. మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొన్నారట. కేవలం పాలే గనుక.. స్నానంతో వదిలిపోయింది గానీ.. ఆ పాలలో కాసింత చక్కెర కూడా కలిపి ఉంటే.. నాయకుడిని కార్యకర్తలు వదలిపెట్టినా.. చీమలు వదిలిపెట్టకుండా పట్టుకునేవేమో అని ప్రజలు జోకులేసుకుంటున్నారు. మరోవైపు.. ఆరు తాండాలకు ఆరు కుండలతో పోశారు.. అదే అరవై తాండాలు పంచాయతీలు అయిఉంటే ఏంటి పరిస్థితి.. అనే జోకులుకూడా వినిపిస్తున్నాయి.