Begin typing your search above and press return to search.

స్పీకర్ సార్!! అస్సాం స్పీకరును చూడండి సార్!!

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:27 AM GMT
స్పీకర్ సార్!! అస్సాం స్పీకరును చూడండి సార్!!
X
తెలంగాణలో మంత్రి తలసాని వ్యవహారం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే కదా. ఆయన టీడీపీ నుంచి గెలిచి టీఆరెస్ లో చేరి మంత్రి పదవి అందుకోవడంపై స్పీకరును టీడీపీ ఎన్నిసార్లు చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదు. తలసాని ఒక్కరే కాదు... అలా పార్టీలు ఫిరాయించిన వారి విషయంలో తెలంగాణ స్పీకరు మధుసూదనాచారి నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. చివరకు విషయం కోర్టుకు వెళ్లడం... అక్కడ ఇటీవలే 2 నెలల టైం ఇవ్వడంతో ఈసారి ఏం చేస్తారన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. అయితే... ఈలోగా అస్సాంలో జరిగిన సంఘటన గురించి విన్నవారంతా తెలంగాణ స్పీకరు ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించుకుంటున్నారు. అక్కడో రూలు ఇక్కడో రూలు ఉంటుందా అంటున్నారు.

అస్సాం శాసనసభలో ఏకంగా తొమ్మిదిమంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్‌ నుండి బిజెపిలోకి చేరిన జయంత మల్లాహ్‌ బారువా - పల్లబ్‌ లోచన్‌ దాస్‌ - పీజూష్‌ హజారికా - అబు తాహెర్‌ బేపారి - ప్రదాన్‌ బారువా - కృపానాథ్‌ మల్లాహ్‌ - వినందాకుమార్‌ సైకియా - రాజేన్‌ బోర్థాకూర్‌ - బోలిన్‌ చేతియాలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీన కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ నిలోమణి సేన్‌ దేకా వీరిపై చర్య తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌ కు ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో ఆయన రెండు వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత యాంటి డిఫెక్షన్‌ చట్టాన్ని అనుసరించి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరి తెలంగాణలో ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నం జరిగిందా...? అస్సలు లేదు. టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు ఎన్నిసార్లు స్పీకరును కలిసినా ఆయన పట్టించుకున్న సందర్భమే లేదు. ఫిరాయింపుల విషయంలో మౌనంగా ఉండి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న స్పీకరు ఇప్పుడు అస్సాం ఘటనతో మరోసారి అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.