Begin typing your search above and press return to search.

రేవంత్‌ రెడ్డిపై ఆ నిర్ణయం ఖాయమా?

By:  Tupaki Desk   |   27 Jun 2015 4:57 AM GMT
రేవంత్‌ రెడ్డిపై ఆ నిర్ణయం ఖాయమా?
X
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అసలు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయే అని భావిస్తున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికితే అధికారపక్షంపై విరుచుకుపడేవారిలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందుండేవారు. తద్వారా ఆయనపై టీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్రుగానే ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్న రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ వర్గాలు ఏసీబీకి సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాయి. అరెస్టు సందర్భంగా రేవంత్...ప్రభుత్వ అవినీతిపై పోరాడుతానని, అసెంబ్లీ వేదికగా సర్కారును నిలదీస్తానని అని ప్రకటించారు.

ఓటుకు నోటు కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ మరింత వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ బెయిల్ దొరికి రేవంత్ విడుదల అయినప్పటికీ, ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం శాసనసభా సభ్యుడైన రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో సస్పెన్షన్‌ వేటు దిశగా కసరత్తు సాగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు తగ్గ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగే విషయంలో పూర్తి స్థాయి స్పష్టత లేనప్పటికీ సమావేశాలు జరినపుడు ఈ దిశగా చర్యలు తప్పవని అభిప్రాయపడుతున్నారు. అయితే, కోర్టులో కేసు నడుస్తుండగా రేవంత్ పై అసెంబ్లీలో చర్యలు తీసుకునే వీలుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై వివరాలు సైతం సేకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్యలు తీసుకోవడానికి, కోర్టు కేసుకు అసలు సంబంధమే ఉండదని పలువురు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కోర్టులో కేసులు నడుస్తున్న అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిపి, తీర్మానాలు చేసి, నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులు కూడా టీఆర్‌ఎస్‌కు తమ అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. సభ్యుడి సస్పెన్షన్‌ అనేది పూర్తిగా సభాపతి అయిన స్పీకర్‌ పరిధిలోనిదని వివరిస్తున్నారు.

‘ఎమ్మెల్యేగా ఉంటూ ముడుపుల కేసులో అడ్డంగా దొరికి ప్రజా ప్రాతినిధ్యానికే మచ్చ తెచ్చారు’ అనే కారణంతో రేవంత్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో సస్పెన్షన్ తీర్మానం పెడితే...మెజార్టీ సభ్యులు అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. తద్వారా సభనుంచి రేవంత్ ను సస్పెండ్ చేయవచ్చు. సస్పెన్షన్ ఎంతకాలం అనేది సమయానుసారం జరిగే నిర్ణయం అని భావిస్తున్నారు.