Begin typing your search above and press return to search.

బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌.. 'మ‌ర‌మ‌నిషి' రాజ‌కీయం!!

By:  Tupaki Desk   |   7 Sep 2022 12:30 PM GMT
బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌.. మ‌ర‌మ‌నిషి రాజ‌కీయం!!
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీల మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత రాజుకుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. రాజాసింగ్‌.. వ్య‌వ‌హారాలు దుమ్మురేపితే.. ఇప్పుడు తాజాగా బీజేపీ నాయ‌కుడు, మాజీమంత్రి ఈటల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు.. రెండు పార్టీల మ‌ధ్య‌ రాజ‌కీయాల‌ను వేడె క్కించాయి. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్రారంభించినప్ప‌టికీ.. కేవ‌లం రెండు రోజుల‌కే ప‌రిమితం చేయ‌డం.. తొలిరోజు 6 నిముషాల‌కే ముగించేయ‌డం వంటివి రెండు పార్టీల మ‌ధ్య వాగ్యుద్దానికి దారితీశాయి.

ఈ క్ర‌మంలోనే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డిని ఈట‌ల రాజేంద‌ర్ `మ‌ర‌మ‌నిషి` అని వ్యాఖ్యానించ‌డం.. దుమారానికి దారితీసింది. దీంతో అధికార ప‌క్షం నుంచి ఏకంగా.. రాజేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌నే డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది.ఈ ప‌రిణామాన్నిసీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ.. ఎదురు దాడిని ముమ్మ‌రం చేసింది. ఇదంతా వ్యూహాత్మ‌కంగానే సాగుతున్న ప‌రిణామంగా చెప్పుకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని రఘునందన్ రావు తాజాగా ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలను కేవ‌లం రెండు రోజులే నిర్వహించడం దారు ణమన్నారు. శాసనసభ సమావేశాలు మరీ రెండ్రోజులే నిర్వహించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంట ని ప్రశ్నించారు. సభాపతి బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునందన్‌రావు అన్నారు.

అంతేకాదు.. మరమనిషి అనేది నిషిద్ధ పదమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బల్లాలు ఎక్కి, మైకులు విసిరి, గవర్నర్ కుర్చీనే తన్నినప్పుడు ఈ సభా సంప్రదాయం ఎక్కడికి పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని రఘునందన్ ప్రశ్నించారు.

మరమనిషి అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచి నట్లా అని అడిగారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీని రానీయకుండా చేసేందుకు మంత్రులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ మ‌ధ్య మ‌రో రాజ‌కీయ యుద్ధం ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.