Begin typing your search above and press return to search.

‘అవిశ్వాసం’ ఇక సమాధి అయినట్టే!

By:  Tupaki Desk   |   28 March 2018 8:52 AM GMT
‘అవిశ్వాసం’ ఇక సమాధి అయినట్టే!
X
లోక్ సభ వేదికగా 16 రోజులుగా సాగుతున్న డ్రామా ఇక చరమాంకానికి చేరుకున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు మాత్రమే కాదు.. మరికొన్ని పార్టీలు, వ్యక్తిగతంగా సభ్యులు కూడా కలిసి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అన్నీ బుట్ట దాఖలు కానున్నాయి. కనీస నైతిక విలువలు - సభా మర్యాదలు - సాంప్రదాయాలు కూడా పాటించకుండా.. మోడీ సర్కారు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా.. వారిలోని పిరికితనం కారణంగా ‘అవిశ్వాస తీర్మానం’ అనేది సమాధి కానున్నది. బహుశా ఒకటిరెండురోజుల్లో... వీలైతే గురువారం నాటికే ఈ లాంఛనం కూడా ముగుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

లోక్ సభలో సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా.. అన్నా డీఎంకే సభ్యులు పదేపదే ఆందోళనలతో విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ఆందోళనలను సాకుగా చూపిస్తూ... స్పీకరు సుమిత్రా మహాజన్ సభను అనేకమార్లుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. బుధవారం నాడు కూడా సభలో ఇదే రిపీట్ అయింది. కాకపోతే ఇవాళ ఆమె ఇంకో అడుగు ముందుకేసి.. మరో సంగతి కూడా స్పష్టంగా ప్రకటించారు.

‘‘సభ ఆర్డర్ లో లేకుండా ఉండేలా.. ఇదేమాదిరి ఆందోళనలను అన్నా డీఎంకే సభ్యులు కొనసాగిస్తే గనుక.. లోక్ సభను తాను నిరవధికంగా వాయిదా వేస్తానంటూ ఆమె చేసిన హెచ్చరిక ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎందుకంటే.. సభను నిరవధికంగా వాయిదా వేయడం అనేది.. అన్నా డీఎంకే ఆందోళనలకు పరిష్కారం ఎలా అవుతుంది? తమ తమ ఆందోళనల రూపేణా అన్నా డీఎంకే వారు వ్యక్తం చేస్తున్న అంశం గురించి కేంద్ర స్పందించి సమాధానం ఇవ్వడం అనేది మోడీ సర్కారు ఎదుట ఉన్న కనీస బాధ్యత. అలా సమాధానం వచ్చేలా చూడడం సభాధ్యక్ష స్థానంలో ఉన్న సుమిత్రా మహాజన్ బాధ్యత. కాకపోతే.. వారు తమ తమ బాధ్యతలను విస్మరించారు. అవిశ్వాసం అనేది చర్చకు రాకుండా, మోడీ సర్కారు వంచన గురించి సభలో చర్చ జరగడం ఇష్టం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

అన్నాడీఎంకే ఇదేతీరుగా వ్యవహరిస్తే.. సభను నిరవధికంగా వాయిదా వేస్తానంటూన్న స్పీకరు.. బహుశా గురువారం ఆ పనిచేసేయవచ్చు. అక్కడితో.. ఇక అవిశ్వాసం అనే అంశం మరుగున పడిపోతుంది. అది ఇక సమాధి అయినట్లే. మళ్లీ పార్లమెంటు సమావేశాలు ఎప్పటికి ఉంటాయో ఎవరికెరుక. ఆందోళనలు చేస్తున్న అందరూ కూడా తిరిగి ఎవరి వ్యాపారాల్లో వారు మునిగిపోయి.. ప్రత్యేకహోదా అనే పోరాటాన్ని సాంతం సమాధి చేసేస్తారు. అదే భయం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతోంది.