Begin typing your search above and press return to search.

ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశద్రోహం అనలేం : సుప్రీం కోర్టు !

By:  Tupaki Desk   |   3 March 2021 9:51 AM GMT
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే  దేశద్రోహం అనలేం : సుప్రీం కోర్టు !
X
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ,ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తం చేయడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూఖ్‌ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే , ఆ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫరూఖ్‌ అబ్దుల్లా.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనితో కొందరు ఆయనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించేందుకు అబ్దుల్లా.. చైనా, పాకిస్థాన్‌ సాయం తీసుకుంటూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని పిటిషనర్‌ ఆరోపణలు చేశారు. అయితే , ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించడం , ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాత్రానికే దేశ ద్రోహంగా పేర్కొనలేమని తెలిపింది. అబ్దుల్లా పై చేసిన ఆరోపణలను రుజువు చేయడంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి‌ విఫలమైనందున ఈ పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అలాగే , ఇదే సమయంలో పిటిషనర్ ‌కు రూ.50వేల జరిమానా విధించింది.