Begin typing your search above and press return to search.

‘పద్మ’ లిస్ట్ లో రైతు.. యోగా.. విదేశీయులు

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:52 AM GMT
‘పద్మ’ లిస్ట్ లో రైతు.. యోగా.. విదేశీయులు
X
తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రకటనలో చాలానే విశేషాలు ఉన్నాయి. 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించటమేకాదు.. ఎంపికలోనూ విలక్షణత్వం కనిపించటం గమనార్హం. పద్మశ్రీ అవార్డులు అన్న వెంటనే సినీ రంగ ప్రముఖులో.. లేదంటే క్రీడా ప్రముఖులో.. కాదంటే సామాజిక సేవలు అందించిన వారికో లభించటం చూస్తాం. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఒక రైతుకు పద్మశ్రీ అవార్డు లభించటం గమనార్హం.

ఒక రైతుకు.. విదేశీ యోగా గురువులకు.. దౌత్య వేత్తకు పద్మ పురస్కారాలు లభించటం విశేషం. మరి.. వీరికి సంబంధించిన విశేషాలు చూస్తే..

సుభాష్ పాలేకర్ (రైతు)

మహారాష్ట్ర విదర్భలోని బెలోరా ప్రాంతానికి చెందిన వారు. వ్యవసాయ పట్టభద్రుడైన పాలేకర్.. పర్యావరణ.. వ్యవసాయ నిపుణులతో కలిసి పని చేశారు. ప్రకృతి సేద్యంపై ఆయన విశేష కృషి చేయటంతో పాటు.. మహారాష్ట్రలోని కరవు ప్రాంతాల్లో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది.

విల్ (దౌత్యవేత్త)

అమెరికా రాయబారిగా భారత దేశంలో రెండేళ్ల పాటు (2001-03) వరకు పని చేసిన విల్ కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. విదేశీ వ్యవహారాల్లో సమస్యల్ని పరిష్కరించటం.. భారత్.. అమెరికా మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేయటానికి విల్ విశేషంగా కృషి చేశారు. అమెరికాలోని ఇదాహోలో 1939లో జన్మించారు. అమెరికా విదేశాంగ శాఖలో 1967లో చేరిన విల్.. కెన్యా.. బ్రిటన్.. ఇజ్రాయెల్.. ఇరాక్ లలో కూడా దౌత్యవేత్తగా పని చేశారు.

ప్రెడ్రాగ్ నికిల్ (యోగా)

యోగాను ప్రచారం చేసిన ఈ సెర్బియా దేశస్తుడు.. మత విశ్వాసాలు.. సైకాలజీ.. సంస్థాగత సంస్కృతి తదితర అంశాలపై మాష్టర్ డిగ్రీలు పొందారు. యోగా మీద ఏళ్ల తరబడి పని చేస్తూ.. ప్రచారం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సైంటిఫిక్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చెస్.. యోగా ఫెడరేషన్ ఆఫ్ సెర్బియాకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

ఝూంగ్ హుయ్ లాన్ (చైనా)

ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా.. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న దేశమైన చైనాకు చెందిన ఝూంగ్ హుయ్ లాన్ యోగాను విపరీతంగా అభిమానిస్తారు. యోగా ప్రచారాన్ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఆమెను ‘‘మదర్ ఆఫ్ చైనా యోగా’’గా కీర్తిస్తుంటారు. 1985లో చైనాలో యోగా శిక్షణ షురూ చేసిన ఆమెకు చైనాలో చాలామంది పేరుంది.