Begin typing your search above and press return to search.

12 బృందాలు వెతుకుతున్నా దొరకని చింతమనేని

By:  Tupaki Desk   |   5 Sep 2019 8:28 AM GMT
12 బృందాలు వెతుకుతున్నా దొరకని చింతమనేని
X
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. దూకుడుగా వ్యవహరించటం.. అధికారం చేతిలో అంటే.. మహిళా అధికారులని కూడా చూడకుండా వారిపై భౌతికదాడులు చేయటం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కే చెల్లుతుంది. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో టీడీపీ అధినేత లైట్ తీసుకోవటం తెలిసిందే.

చింతమనేని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా బాబు పట్టనట్లుగా వ్యవహరించటంతో ఆయన మరింతగా చెలరేగిపోయారన్న విమర్శ ఉంది. తన నియోజకవర్గ పరిధిలో తాను చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది.ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓడిన అనంతరం కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై జోసెఫ్ అనే యువకుడు ధైర్యంగా ముందుకొచ్చి చింతమనేనిపై కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో.. అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్న చింతమనేని ఎవరికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు.

ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు 12 బృందాలతో కూడిన పోలీసులు వెతుకుతున్నా.. ఆయన ఆచూకీ మాత్రం లభించటం లేదు. వివాదాస్ప రీతిలో వ్యవహరించటమే కాదు.. భారీ ఎత్తున పోలీసులు వెతుకుతున్నా.. దొరక్కుండా ఉండటంలోనూ తనకున్న ప్రతిభను చింతమనేని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. అరెస్ట్ ముప్పు ఎదుర్కొంటున్న చింతమనేని.. పోలీసులకు చిక్కుండా నేరుగా.. కోర్టులో లొంగిపోతారన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు కారణమైన జోసెఫ్ పై ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు. చింతమనేనిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న వార్నింగ్ లు ఇస్తున్నట్లుగా జోసెఫ్ చెబుతున్నారు.పోలీసులకు దొరక్కుండా.. తనపై కేసు పెట్టిన జోసెఫ్ ను బెదిరిస్తున్న చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లుగాతెలుస్తోంది. మరి.. చింతమనేని దొరుకుతారా? అన్నదిప్పుడున్న ప్రశ్న.