Begin typing your search above and press return to search.

ప్రత్యేకహోదాపై చర్చకు వైసీపీ పట్టు

By:  Tupaki Desk   |   19 July 2021 10:30 AM GMT
ప్రత్యేకహోదాపై చర్చకు వైసీపీ పట్టు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ కు సోమవారం నోటీసులు జారీ చేశారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నోటీసును ఇచ్చారు.

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఇతర వ్యవహారాలన్ని పక్కనపెట్టి రూల్ 267 కింద ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని విజయసాయిరెడ్డి నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయిరెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోమన్ సింగ్ ఏపీకి పలు హామీలు ఇచ్చారని.. అందులో ప్రధానమైనది ప్రత్యేక హోదా అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశం చర్చించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించిందని గుర్తు చేశారు. ఇది జరిగి ఏడేళ్లు కావస్తున్న కేంద్రం ఈ హామీని నెరవేర్చలేదని అన్నారు.

అందుకే వెంటనే సభా కార్యక్రమాలన్నింటిని సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ కు నోటీసుల్లో విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలోనే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. వైసీపీ ఎంపీలు రాజ్యసభ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు.