Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం అయ్యే సత్తా షర్మిలకు ఉందా?

By:  Tupaki Desk   |   16 April 2021 5:30 AM GMT
తెలంగాణ సీఎం అయ్యే సత్తా షర్మిలకు ఉందా?
X
రాజకీయాల్లో ఆశ ఉండాలి.. కానీ అత్యాశ పనికిరాదు.. అది రాజకీయమైనా.. మన జీవితమైనా.. గాలిలో మేడలు కట్టేసి.. దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు కుప్పకూలకుండా కాపాడలేడు. ఇప్పుడు వైఎస్ షర్మిల పరిస్థితి కూడా అలానే ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పార్టీ పెట్టనేలేదు.. ఎజెండా ప్రకటించనే లేదు.. ‘తెలంగాణకు కాబోయే సీఎం తానేనని’ నని షర్మిల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. పగటి కలలు మానేసి ప్రజాక్షేత్రంలో బలం ఎంతో నిరూపించుకోవాలని ఆమె ప్రత్యర్థులు అప్పుడే సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ఇక్కడ రాజ్యాధికారమే లక్ష్యమంటూ షర్మిల ముందుకు వెళుతున్నారు. తాజాగా ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని దీక్ష చేశారు. ఈ నిరసన దీక్షలోనే ‘తెలంగాణకు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని.. బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని..’ షర్మిల శపథం చేశారు.

అయితే తెలంగాణ సాధించాక మునుపటితో పోలిస్తే చాలా మార్పులే వచ్చాయి. నీళ్లు, నిధులు బాగానే వచ్చేసాయి. కాళేశ్వరం సహా ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కి.. రైతులు సంతోషంగానే ఉన్నారు. ఉద్యోగుల కోరికలను తీర్చేసి కేసీఆర్ ఖుషీ చేశారు. కావాల్సిందల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రమే. ఆ నిరుద్యోగులనే పట్టుకొని కేసీఆర్ ను టార్గెట్ చేసింది షర్మిల.

దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఈ నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన లేమి టీఆర్ఎస్ ను భారీ దెబ్బ తీసింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటనలకు రెడీ అయ్యారు. ఆ ముచ్చట కూడా తీర్చేసి నిరుద్యోగులను బిజీ చేస్తే షర్మిల పోరాడడానికి అసలు టాపిక్ ఉండదు. అదే పనిలో కేసీఆర్ సర్కార్ బిజీగా ఉంది. నాగార్జున సాగర్ ఫలితం తర్వాత దీనిపై సీరియస్ గా దృష్టి సారించనుంది.

అయితే ఆంధ్రాలో పుట్టిన ఆడకూతురు.. తెలంగాణ కోడలుగా ఇక్కడ రాజకీయం చేయడాన్ని ఇక్కడి ప్రజలే కాదు.. రాజకీయ నాయకులు కూడా జీర్ణించుకోవడం లేదు. ఎందుకంటే ఆది నుంచి తెలంగాణ కొట్లాడింది ఆంధ్రుల కంబధ హస్తాల నుంచి స్వేచ్ఛను అనుభవించడానికే. ఆంధ్రా పాలనను తుదముట్టించడానికే. తెలంగాణ ఉద్యమం సాగింది ఆంధ్రులకు వ్యతిరేకంగానే. ఇప్పుడు షర్మిల తెలంగాణ గడ్డపై ఇంత గొంతుచించుకుంటున్నా స్పందన లేకపోవడానికి.. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద నేతలు నడవకపోవడానికి కారణం అదే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఆంధ్రుల పెత్తనం ఏందన్న డైలాగ్ ఒక్కటే వైఎస్ షర్మిలకు పెద్ద మైనస్ గా మారిందని అంటున్నారు.

2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంత చంద్రబాబుతో జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడింది. తెలంగాణ వచ్చినా ఇంకా పాలనను చంద్రబాబు పాదాలకింద పెడుతారా? అన్న కేసీఆర్ డైలాగ్ బాగా పనిచేసింది. అందుకే కాంగ్రెస్ ను ఓడించేశారు. తెలంగాణ ప్రజల్లో ‘ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంట్’ అన్నది నరనరాన దశాబ్ధాలుగా జీర్నించుకుపోయిందన్నది కఠిన వాస్తవం. అందుకే ఆంధ్రా నేత అయిన షర్మిల ఎంత రాజకీయం చేద్దామన్నా ఇక్కడ ప్రజల్లో నేతల్లో స్పందన రావడం లేదు. ఖమ్మం సభకు జనాలు రాలేదంటారు. ఇక ఆమెకు ఇక్కడ గెలుపు అసాధ్యమంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా ఉద్యమకారుల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఒక ఆంధ్రా నేత సీఎం కాగలరా? అంటే దాదాపు అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. మరి వైఎస్ షర్మిల ఆశ అడియాశలు అవుతాయా? అంటే కాలమే సమాధానం చెబుతుంది..