Begin typing your search above and press return to search.

వైసీపీలో జెండా మోసిన వాళ్లకు ‘గుండు’ సున్నానేనా..?

By:  Tupaki Desk   |   30 March 2021 7:50 AM GMT
వైసీపీలో జెండా మోసిన వాళ్లకు ‘గుండు’ సున్నానేనా..?
X
వైఎస్సార్సీపీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ జెండాలు మోసి, పార్టీని బతికిచ్చుకున్న వారు ఇప్పుడేమంటున్నారు..? వారికి సరైన న్యాయం జరగడం లేదా..? నిజమైన కార్యకర్తలు హైకమాండ్ కు వారి బాధలు చెబితే వింటోందా..? ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నిజమైన కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెడుతున్నారు..? తీవ్ర మనోవేదనకు గురవుతున్న వైసీపీ రియల్ కార్యకర్తలు తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియక అరిగోస పడుతున్నారట.? వారి వేదన అరణ్యరోదనగా మారుతోందట..

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ తక్కువ సీట్లకే పరిమితమైంది. వారిలో కూడా టీడీపీ ప్రలోభాలకు గురై పార్టీని 23మంది ఎమ్మెల్యేలు వీడి పదవులు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో వైపీపీ వెంటే ఉంటూ ఆ పార్టీ జెండా మోసిన వారు ఎందరో ఉన్నారు. అధికార టీడీపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వైసీపీనే నమ్ముకొని సొంత ఖర్చులతో పార్టీని బతికించిన వారున్నారు. అయితే వారికి ఇప్పుడు సరైన న్యాయం జరగడం లేదట. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదట.

సీఎం జగన్ సొంత జిల్లాలోని పులివెందులలో కొందరు నిజమైన కార్యకర్తలు ఈ రకంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారట. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నాయకులు నిజమైన కార్యకర్తలను పక్కనబెడుతున్నారట. ఇక మిగతా నియోజకవర్గాల్లోని కొందరు ఎమ్మెల్యేలు తమ దగ్గరి వారితో గ్రూపులుగా విడగొట్టి జగన్ కు చెందిన నాయకులను తొక్కేస్తున్నారట. ఈ విషయమై హైకమాండ్ కు చెప్పుకోగా వారు ఎమ్మెల్యేలతో మాట్లాడుతాం అని చెప్పి పంపిస్తున్నారట.

ఇక హైకమాండ్ ను కలిసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మమ్మల్ని కాదని ఫిర్యాదులు చేస్తారా..? అని నిజమైన వైసీపీ నేతలను దగ్గరికి రానివ్వడం లేదట. ఇక ఏమైనా సొంత పనులకు ఎమ్మెల్యేల దగ్గరికి వెళితే వాటిని కాకుండా చేస్తున్నారట. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తామెంతో పనిచేశామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడే ఇలా ఉంటే రేపు పార్టీ అధికారంలో లేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని వారంతా మథనపడుతున్నారట.. వైసీపీనే నమ్ముకొని జెండా మోసిన వాళ్లకు ఇప్పుడు ‘గుండు’ సున్నానే గతియా అని వారంతా బాధపడుతున్నారట..