Begin typing your search above and press return to search.

పోలవరం.. కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు!

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 AM GMT
పోలవరం.. కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు!
X
ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ‘పోలవరం’ ప్రాజెక్టు. ఎందరో సీఎంలు మారినా మారని తలరాత పోలవరంకు ఉంది. గత చంద్రబాబు పాలనలో టెండర్లు అయ్యి మొదలు పెట్టినా కూడా పూర్తి చేయకుండా కాలం గడిపేశారు. ఏపీకి సాగు, తాగునీరందించే ఈ ప్రధాన ప్రాజెక్టును రాష్ట్రంలో సీఎంగా గద్దెనెక్కగానే వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండర్లు పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ‘మేఘా’ ఈ టెండర్ ను దక్కించుకొని వడివడిగా చేస్తోంది.

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా పనులు ఆగిపోయి వలస కూలీలు బతుకు భయంతో తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. పోలవరం పనుల కోసం వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన 1200 మంది కూలీలు కూడా స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో పోలవరం నిర్మాణ పనుల్లో స్తబ్ధత వచ్చింది.

ఈ లాక్ డౌన్ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ , ఏపీ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేసింది. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయాలంటే వలస కూలీలు అవసరం కావడంతో వారిని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రత్యేక రైళ్లను మేఘా - ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇప్పటికవే దాదాపు 1000మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వెనక్కు తీసుకువచ్చారు. వచ్చేవారం మరో 1800మంది కార్మికులను ప్రాజెక్టు పనుల కోసం తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక కార్మికులకు వేతనాలు పెంచి.. కరోనా నియంత్రణ చర్యలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్టు మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు.