Begin typing your search above and press return to search.

ఆ మంత్రిగారి పేషీ ఒక మిఠాయి కొట్టు!

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:15 AM GMT
ఆ మంత్రిగారి పేషీ ఒక మిఠాయి కొట్టు!
X
అనగనగా ఓ మంత్రిగారు ఉన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మద్యలో కాస్తంత ఖాళీ దొరికినప్పుడు ఆయన వచ్చి తన ఛాంబర్లో కూచుంటారు. తన శాఖకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైనా ఏదైనా వినతిపత్రాలను తీసుకుని ఆయన వద్దకు వచ్చారనుకోండి.. ఆ వినతిపత్రాలను ఆయన స్వీకరించడమూ, అందులో ప్రస్తావించిన సమస్యలు ఏమిటో తెలుసుకోవడమూ.. వాటిని పరిష్కరించడానికి మార్గాల గురించి అధికారులతో మాట్లాడడమూ ఇవన్నీ తరువాత.. ముందుగా ఆయన అతిథి అయిన ఎమ్మెల్యేను కూర్చుండబెట్టి.. తన బంట్రోతుతో గోదావరి జిల్లా ప్రత్యేకతను సంతరించుకున్న మిఠాయిలు, కారాలు తెప్పించి అవి తినేదాకా ఊరుకోరు.

మధ్యలో వారు ‘అయ్యా మా వినతిపత్రం’ అని గుర్తు చేయబోతే కూడా చాలా ప్రేమగా కసురుకుంటారు. ‘అది చేసేద్దాం లెండి.. ముందు మీరివి తినండి.. చాలా బావుంటాయి.. తినండి’ అంటూ కొసరి కొసరి మరీ వడ్డించేస్తుంటారు. ప్రత్యేకించి అసెంబ్లీ సమయంలో ఆయన ఛాంబర్ కు ఎవరు వెళ్లినా సరే.. ఆయన ప్రేమలోనూ.. గోదావరి యాస తొణికిసలాడే ఆయన భాషలోనూ - అతిథి మర్యాదల్లోనూ - మిఠాయిల వెల్లువలోనూ తడిసి ముద్దయిపోవాల్సిందే.

ఇంతకూ ఆ మంత్రి ఎవరో తెలుసా? హోం మంత్రి చినరాజప్ప.

చినరాజప్ప ప్రతి ఒక్కరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. తన ఛాంబర్ ఎవరు వచ్చినా.. మిఠాయిలు చిరుతిళ్లతో అతిథి సత్కారాలు చేయకుండా ఎన్నడూ పంపరు. సాధారణంగా పూతరేకులు - కాజాలు - లడ్డూలు - కారప్పూస - జంతికలు ఇవన్నీ నిత్యం ఆయన చాంబర్లో ఉంటుంటాయి. అయిపోయే కొద్దీ ఊరినుంచి స్టాకు వస్తూనే ఉంటుంది. ఎన్నడూ వాటికి మాత్రం కొరత రానివ్వకుండా ఆయన అందరికీ పెడుతుంటారు. తాజాగా ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చిన రాజప్ప తన పేషీకి వచ్చిన వారందరికీ బెల్లం లడ్డూలు - జంతికలు కొసరి మరీ తినిపిస్తున్నారట. మాకు షుగర్ ఉంది బాబోయ్ అంటూ ఎవరైనా నో చెప్పినా, అందుకే బెల్లం లడ్డూలు తెప్పించా చాలా బాగుంటాయ్ తినండి అంటూ మొహమాట పెట్టేస్తున్నారట. అందుకే ‘‘మా హోం మంత్రి గారి పేషీ.. డబ్బులు అడగని.. మిఠాయి కొట్టు’’ అంటూ ఎమ్మెల్యేలు మురిసిపోతుంటారట.